టయోటా హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ‘వెల్‌ఫైర్‌’

27 Feb, 2020 06:06 IST|Sakshi
వెల్‌ఫైర్‌తో నవీన్‌ సోని, మసకజు యోషిముర, విక్రమ్‌ కిర్లోస్కర్, సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టడషి అసజుమ (ఎడమ నుంచి)

ధర రూ.79.50 లక్షలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ సెల్ఫ్‌ చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ‘వెల్‌ఫైర్‌’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్‌ వాహనాన్ని కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ధర రూ.79.50 లక్షలు. డ్యూయల్‌ మోటార్స్‌తో 2.5 లీటర్ల గ్యాసోలిన్‌ హైబ్రిడ్‌ ఇంజన్‌ పొందుపరిచారు. 2800–4000 ఆర్‌పీఎంతో 198 ఎన్‌ఎం టార్క్, మైలేజీ లీటరుకు 16.35 కిలోమీటర్లు. భద్రత కొరకు 7 ఎస్‌ఆర్‌ఎస్‌ ఎయిర్‌ బ్యాగ్స్, వెహికిల్‌ డైనమిక్స్‌ ఇంటెగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్, వెహికిల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి ఫీచర్లను జోడించారు. 40 శాతం దూరం, 60 శాతం సమయం ఎలక్ట్రిక్‌ మోడ్‌లో ప్రయాణిస్తుంది. కళ్లు చెదిరే ఇంటీరియర్స్, ట్విన్‌ మూన్‌రూఫ్స్‌ దీని ప్రత్యేకత. నాలుగు రంగుల్లో లభిస్తుంది.  

హైదరాబాద్‌ నుంచి 20%..: టెస్ట్‌ మార్కెట్‌గా పేరొందడంతోపాటు ప్రధాన మార్కెట్‌ కావడంతో వెల్‌ఫైర్‌ను హైదరాబాద్‌ వేదికగా విడుదల చేసినట్టు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తొలి 3 నెలల షిప్‌మెంట్స్‌ అమ్ముడైనట్టు టీకేఎం ఎస్‌వీపీ నవీన్‌ సోని వెల్లడించారు. ఒక్కో షిప్‌మెంట్లో 60 వాహనాలు ఉంటాయని వివరించారు. అమ్ముడైన వాహనాల్లో 20%పైగా హైదరాబాద్‌ నుంచే నమోదయ్యాయన్నారు. అంతర్జాతీయంగా 6 లక్షలకుపైగా వెల్‌ఫైర్‌ వాహనాలు విక్రయమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వెల్‌ఫైర్‌ వాహనాలను జపాన్‌ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. 1.5 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా విక్రయించామని టీకేఎం ఎండీ మసకజు యోషిముర వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో టయోటాకు 43% వాటా ఉందన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు