భారత్‌లో లెక్సస్‌ కార్ల ఎంట్రీ..

8 Feb, 2017 01:17 IST|Sakshi
భారత్‌లో లెక్సస్‌ కార్ల ఎంట్రీ..

మార్చి 24న కార్ల విడుదల ∙మూడు మోడళ్లతో ప్రవేశం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల బ్రాండ్‌ లెక్సస్‌ భారత్‌లో అడుగుపెడుతోంది. టయోటాకు చెందిన ఈ బ్రాండ్‌ భారత్‌లో తొలుత మూడు మోడళ్లతో ఎంట్రీ ఇస్తోంది. మార్చి 24న ఇవి అధికారికంగా విడుదల కానున్నాయి. లెక్సస్‌ తొలి షోరూం ముంబైలో ఏర్పాటవుతోంది. దశలవారీగా హైదరాబాద్‌సహా మిగిలిన నగరాల్లో ఔట్‌లెట్లు తెరుచుకోనున్నాయి. ఆర్‌ఎక్స్‌450హెచ్‌ ఎస్‌యూవీ, ఎల్‌ఎక్స్‌450డీ ఎస్‌యూవీ, ఈఎస్‌300హెచ్‌ సెడాన్‌ ముందుగా రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతానికి పూర్తిగా తయారైన కార్లనే కంపెనీ జపాన్‌ నుంచి దిగుమతి చేస్తుంది. సొంత ప్లాంటు ఏర్పాటయ్యే వరకు టయోటాకు చెందిన యూనిట్‌లో రానున్న రోజుల్లో తయారీ చేపడతారు. ప్రస్తుతం 70కిపైగా దేశాల్లో లెక్సస్‌ కార్లు పరుగెడుతున్నాయి. 24 మోడళ్లు వివిధ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.

ఇవీ కార్ల ఫీచర్లు: లెక్సస్‌ ఆర్‌ఎక్స్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 3.5 లీటర్, వీ6 పెట్రోల్‌ మోటార్, టయోటా అభివృద్ధి చేసిన హైబ్రిడ్‌ సిస్టమ్‌ను ఆర్‌ఎక్స్‌450హెచ్‌ మోడల్‌కు పొందుపరిచారు. అంతర్జాతీయంగా ఆడి క్యూ5, బీఎండబ్లు్య ఎక్స్‌3 మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.17 కోట్లు ఉండొచ్చని సమాచారం. ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ అయిన ఎల్‌ఎక్స్‌ సిరీస్‌లో రెండు ఇంజన్‌ ఆప్షన్స్‌లో కార్లను ప్రవేశపెట్టింది. ఎల్‌ఎక్స్‌570 పెట్రోల్‌తో 5.7 లీటర్‌ వీ8 ఇంజన్, ఎల్‌ఎక్స్‌450డీ డీజిల్‌తో ట్విన్‌ టర్బో 4.5 లీటర్‌ వీ8 డీజిల్‌ ఇంజన్‌ను పొందుపరిచారు. ఎల్‌ఎక్స్‌450డీ తొలుత అయిదు సీట్లతో రానుంది. అక్టోబరులోగా 7 సీట్ల పెట్రోల్‌ వేరియంట్‌ అడుగుపెట్టనుంది. రేంజ్‌ రోవర్, ఆడి క్యూ7, మెర్సిడెస్‌ జీఎల్‌కు ఎల్‌ఎక్స్‌ సిరీస్‌ పోటీనిస్తుంది.

మరిన్ని వార్తలు