కృష్ణపట్నం ప్లాంటులో కార్యకలాపాలు షురూ:

3 Mar, 2015 02:30 IST|Sakshi
కృష్ణపట్నం ప్లాంటులో కార్యకలాపాలు షురూ:

థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినట్లు థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (టీపీసీఐఎల్) వెల్లడించింది. 1,320 మెగావాట్ల సామర్ధ్యంతో తలపెట్టిన ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టులో తొలిదశలో 660 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చినట్లు వివరించింది. రెండో విడత కింద మరో 660 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ కొరతను పరిష్కరించేందుకు తమ ప్రాజెక్టు ఉపయోగపడగలదని టీపీసీఐఎల్ తెలిపింది. 25 సంవత్సరాల పాటు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే దిశగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది టీపీసీఐఎల్.  పర్యావరణ అనుకూల విధానాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సూపర్‌క్రిటికల్ టెక్నాలజీని టీపీసీఐఎల్ వినియోగిస్తోంది. గాయత్రి ఎనర్జీ వెంచర్స్ (గాయత్రి ప్రాజెక్ట్స్‌లో భాగం), సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ కలిసి టీపీసీఐఎల్‌ను ఏర్పాటు చేశాయి.

మరిన్ని వార్తలు