గ్లోబల్ ర్యాలీతో మార్కెట్లకు జోష్

19 Feb, 2016 01:35 IST|Sakshi
గ్లోబల్ ర్యాలీతో మార్కెట్లకు జోష్

రెండో రోజూ పెరిగిన దేశీ సూచీలు
వారం గరిష్టానికి సెన్సెక్స్, 267 పాయింట్లు అప్

ముంబై: చమురు ధరల రికవరీతో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీకి అనుగుణంగా గురువారం దేశీ స్టాక్‌మార్కెట్ కూడా లాభపడింది. ఐటీ, బ్యంకులు, హెల్త్‌కేర్ తదితర రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో సూచీలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 267 పాయింట్ల పెరుగుదలతో వారం రోజుల గరిష్టం 23,649 పాయింట్ల వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 7,192 వద్దముగిసింది. చమురు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపే విషయంలో సౌదీ అరేబియా, రష్యా చెంతన ఇరాన్ కూడా చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 35 డాలర్ల స్థాయికి ఎగిసింది.

అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరో నాలుగు సార్లు పాలసీ రేట్లను పెంచే అవకాశాలుండకపోవచ్చని సంకేతాలు ఇవ్వడం తదితర సానుకూల పరిణామాల ఊతంతో ఆసియా, యూరప్ మార్కెట్ల సూచీలు పెరిగాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. చైనా మందగమనం వంటి అంతర్జాతీయ ప్రతికూలాంశాల ప్రభావం పెద్దగా ఉండకపోవటం వల్ల, కమోడిటీల ధరల తగ్గుదల ప్రయోజనాల వల్ల... భారత్ 2016, 2017లో 7.5 శాతం వృద్ధి సాధించగలదంటూ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనాలు వెలువరించడమూ మార్కెట్లకు తోడ్పాటునిచ్చింది.

 డాక్టర్ రెడ్డీస్ జూమ్...
గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 23,536 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 23,735-23,448 మధ్య తిరుగాడింది. చివరికి 1.14 శాతం లాభంతో 23,649 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 7,215-7,128 పాయింట్ల మధ్య తిరుగాడి చివరికి 1.17 శాతం లాభంతో 7,192 వద్ద ముగిసింది. స్టాక్స్ విషయానికొస్తే 44.85 లక్షల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అత్యధికంగా 4.5 శాతం లాభపడి రూ.3,095 వద్ద ముగిసింది. జన్యుమార్పిడి చేసిన  పత్తి విత్తనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీసీఐ విచారణ వార్తలతో మోన్‌శాంటో షేరు 3 శాతం క్షీణించింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో 20 స్టాక్స్ లాభపడ్డాయి.

బీఎస్‌ఈలో రంగాలవారీ సూచీలు చూస్తే.. ఐటీ 1.94%, టెక్నాలజీ 1.9%, హెల్త్‌కేర్ 1.78%, క్యాపిటల్ గూడ్స్ 1.59% పెరిగాయి. మొత్తం 1,418 షేర్లు లాభాల్లోనూ.. 1,110 స్టాక్స్ నష్టాల్లోను, 155 స్టాక్స్ స్థిరంగాను ముగిశాయి. ఆసియాలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర కీలక సూచీలు 1.22-2.32 శాతం పెరిగాయి. అయితే, చైనా షాంఘై సూచీ మాత్రం 0.16 శాతం తగ్గింది. అటు యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.24-0.47 శాతం మేర లాభాలతో ట్రేడవగా.. బ్రిటన్ సూచీలు 0.46 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి.

మరిన్ని వార్తలు