ఎగుమతులు పెరిగినా... వాణిజ్యలోటు భారం!

16 Feb, 2018 00:45 IST|Sakshi

జనవరిలో ఎగుమతుల వృద్ధి 9%

మూడేళ్ల గరిష్టానికి వాణిజ్యలోటు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు 2018 జనవరిలో (2017 జనవరితో పోల్చి) 9 శాతం పెరిగాయి. విలువ రూపంలో రూ.24.38 కోట్లుగా నమోదయ్యింది. ఇక ఇదే నెలలో దిగుమతులు 26.1 శాతం పెరిగాయి. విలువ రూపంలో 40.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 16.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన మూడేళ్లలో ఈ స్థాయిలో వాణిజ్యలోటు పెరుగుదల ఇదే తొలిసారి. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...

♦  క్రూడ్‌ ఆయిల్‌ మొత్తం దిగుమతుల వ్యయంలో భారాన్ని పెంచింది.  
♦    రసాయనాలు (33%), ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు (15.77%), పెట్రోలియం ప్రొడక్టుల (40%)  ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
♦    అయితే రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా 8.38 శాతం క్షీణించాయి. విలువ రూపంలో 1.39 బిలియన్‌ డాలర్లు.
♦     పసిడి దిగుమతులు  22 శాతం తగ్గి 1.59 డాలర్లుగా నమోదయ్యాయి.  
♦   చమురు దిగుమతులు 42.64 శాతం, చమురుయేతర దిగుమతులు 20.49 శాతం పెరిగాయి. విలువ రూపంలో వరుసగా 11.65 బిలియన్‌ డాలర్లు, 29 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.   

ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ...
2017 ఏప్రిల్‌ నుంచి 2018 జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 11.75 శాతం ఎగశాయి. విలువ రూపంలో 247.80 బిలియన్‌ డాలర్లు. ఇక ఇదే కాలంలో దిగుమతులలు 22.21 శాతం పెరిగాయి. దిగుమతుల విలువ 379 బిలియన్‌ డాలర్లు. అంటే వాణిజ్యలోటు 131.15 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

డిసెంబర్‌లో ‘సేవల’ విభాగం...
కాగా 2017 డిసెంబర్‌లో సేవల ఎగుమతుల విలువ 16 బిలియన్‌ డాలర్లుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణాంకాలు వెల్లడించాయి. ఈ విభాగంలో దిగుమతుల విలువ 10 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సేవల వాణిజ్యలోటు 6 బిలియన్‌ డాలర్లు.

మరిన్ని వార్తలు