ట్రంప్‌ ‘ట్రేడ్‌వార్‌’ బుల్లెట్‌ పేలింది, ఇక రణరంగమే..

6 Jul, 2018 11:11 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌ : ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికాకు, చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా ఉత్పత్తులపై ‘ట్రేడ్‌ వార్‌’ బుల్లెట్‌ ప్రయోగించారు. 34 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లను ధృవీకరిస్తూ.. ఈ అర్థరాత్రి నుంచి వీటిని అమల్లోకి తేనున్నట్టు వెల్లడించారు. ట్రంప్‌ ఆదేశాల మేరకు సెమికండక్టర్ల నుంచి ఎయిర్‌ప్లేన్‌ పార్ట్‌ల వరకు పలు చైనీస్‌ దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను అమెరికా కస్టమ్స్‌ అధికారులు సేకరించబోతున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను బీజింగ్‌ దొంగలిస్తుందని, అమెరికా వాణిజ్య అకౌంట్‌కు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించిన అనంతరం డైరెక్ట్‌గా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం ఇదే మొదటిసారి. మరో 16 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై మరో రెండు వారాల్లో టారిఫ్‌ మోత మోగనుందని కూడా హెచ్చరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ కొనసాగుతున్న క్రమంలో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా సైతం అమెరికాకు కౌంటర్‌గా అంతేమొత్తంలో పలు అమెరికన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించింది. వీటిలో సోయాబీన్స్‌ నుంచి  పందిమాంసం వరకూ ఉన్నాయి. ఇటీవల స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌, ప్రపంచదేశాలన్నీ ఆగ్రహంతో ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్‌, కెనడా దేశాలు అమెరికాపై ప్రతీకార పన్నులు విధించేశాయి. అమెరికా ఐకానిక్‌ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్‌ సైతం ఈయూ విధించే టారిఫ్‌లను తప్పించుకోవడానికి అమెరికా నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ చైనీస్‌ వాణిజ్యాన్ని దెబ్బతీసేందుకు పెద్ద మొత్తంలో ట్రంప్‌ ఏమైనా సుంకాలను విధిస్తే, చైనా కూడా అమెరికా కంపెనీలపై కస్టమ్స్‌ ఆలస్యం, పన్ను ఆడిట్లు, రెగ్యులేటరీ తనిఖీలను భారీగా పెంచి, జరిమానాలు విధిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హెచ్చరించారు. అమెరికా కంపెనీలు ఆపిల్‌ ఇంక్‌, వాల్‌మార్ట్‌ ఇంక్‌ నుంచి జనరల్‌ మోటార్స్‌ వరకు అమెరికా కంపెనీలు చైనాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఈ ట్రేడ్‌ వార్‌ అతిపెద్ద ముప్పుగా అవతరించిందని ఆర్థిక వేత్తలంటున్నారు. 

మరిన్ని వార్తలు