పెరిగిన బుల్లిష్‌ రోలోవర్లు!

29 May, 2020 09:52 IST|Sakshi

జూన్‌ సీరిస్‌పై ట్రేడర్లు పాజిటివ్‌

ఈ వారంలో బ్యాంకింగ్‌ స్టాకులకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు మంచి ర్యాలీ జరిపాయి. దీంతో నిఫ్టీ మరోమారు 9400 పాయింట్లను చేరింది. ఇదే జోరు జూన్‌ సీరిస్‌లో కొనసాగుతుందనేందుకు నిదర్శనంగా మంత్లీ బుల్లిష్‌ రోలోవర్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభం కానుండడంతో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. గురువారం గణాంకాలు పరిశీలిస్తే నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ రోలోవర్లు 76 శాతం, స్టాక్‌ రోలోవర్లు 94 శాతంగా నమోదయ్యాయి. గత నెలలతో పోలిస్తే ఇది అధికమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆటో, ఇన్‌ఫ్రా, మీడియా, ఫార్మా రంగాల సూచీలు మేలో పాజిటివ్‌గా ముగిశాయి. బ్యాంకు సూచీ మాత్రం 15 శాతం పతనమైంది. 9000 పాయింట్ల వద్ద నిఫ్టీలో లాంగ్స్‌ పోగయ్యాయని, వీటిలో అధికభాగం జూన్‌ సీరిస్‌లోకి రోలోవర్‌ అయ్యాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వెల్లడించింది.

సూచీల్లో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ఇంకా పూర్తిగా పరిస్థితులు మెరుగుపడలేదని, కొత్తగా ఇండోచైనా టెన్షన్‌, మిడతల దండయాత్రవంటి రిస్కులు పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఇండెక్స్‌లో ఇంకా షార్ట్స్‌ ఉన్నందున మరో షార్ట్‌కవరింగ్‌ ఉండొచ్చని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీకి 9600-9800 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని, 9000 పాయింట్లు గట్టి మద్దతుగా ఉంటుందని నిపుణుల అంచనా ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 10వేల పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉండగా, 9000 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కనుక జూన్‌ సీరిస్‌కు ఈ రెండు స్థాయిల మధ్య నిఫ్టీ కదలికలుండే అవకాశాలున్నాయి. 

మరిన్ని వార్తలు