వ్యాపారుల, పేదల పక్షపాత వ్యాఖ్యలు సరైనవే: జైట్లీ

19 Aug, 2014 02:59 IST|Sakshi
వ్యాపారుల, పేదల పక్షపాత వ్యాఖ్యలు సరైనవే: జైట్లీ

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటు వ్యాపార వర్గాలు, అటు పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందన్న తన వ్యాఖ్యల్లో వైరుధ్యమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇవి రెండూ ఒకదానికి మరొకటి భిన్నమైనవేమీ కావన్నారు. వ్యాపార వర్గాల ద్వారా వచ్చే ఆదాయాలతోనే ఇన్‌ఫ్రా సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు సాధ్యపడుతుందని వివరించారు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో సోమవారం తన కవర్ ఫొటో మార్చిన సందర్భంగా జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వానికి ఆదాయం వస్తే తప్ప.. మౌలిక సదుపాయాల కల్పన, పేదల సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార, పేద వర్గాల పక్షపాతిగా ఉంటుందన్న నా వ్యాఖ్యల్లో వైరుధ్యమేమీ లేదు’ అని పేర్కొన్నారు.

 2014-15 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. వ్యాపార, పేద వర్గాలకు తమ ప్రభుత్వం అనుకూలమైనదని జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయాలు మెరుగుపర్చుకునేందుకు, ఖర్చు చేసే సంస్కృతిని పెంచేందుకు.. తద్వారా పేద వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండటం అవసరమని అప్పట్లో ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు