మొబైల్‌ టారిఫ్‌లలో మరింత పారదర్శకత

28 Nov, 2019 04:14 IST|Sakshi

యూజర్ల వినియోగానికి తగ్గ ప్లాన్‌

సూచించేలా టారిఫ్‌ కాల్‌క్యులేటర్‌

కొత్త, పాత ప్లాన్ల వివరాలన్నీ టెల్కోలు అందుబాటులో ఉంచాలి

ట్రాయ్‌ ప్రతిపాదనలు; అభిప్రాయ సేకరణ

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌ సర్వీస్‌ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్‌ సూచించేలా టారిఫ్‌ కాల్‌క్యులేటర్‌ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల వివరాలు కూడా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల రెండింటిని పోల్చి చూసుకుని తగిన ప్లాన్‌ ఎంపిక చేసుకోవడం సులువవుతుంది. ప్రస్తుతం టెల్కోలు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టాక.. పాత ప్లాన్ల వివరాలను తొలగించేస్తున్నాయి. ఫలితంగా సరైన సమాచారం లేకపోవడం లేదా వివరాలు తప్పుదోవ పట్టించేవిగా ఉండటం లేదా అస్పష్టంగా ఉండటం వంటి వివిధ కారణాలతో యూజర్లు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రాయ్‌ అభిప్రాయపడింది.  

ఇక యూజరు తను ఎంత డేటా, ఎన్ని నిమిషాల అవుట్‌గోయింగ్‌ వాయిస్‌ కాల్స్‌ చేయొచ్చు, ఎన్నాళ్ల వేలిడిటీ కోరుకుంటున్నారు తదితర వివరాలిస్తే.. వారికి అత్యంత అనువైన ప్లాన్స్‌ను సూచించేలా టారిఫ్‌ కాల్‌క్యులేటర్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని ట్రాయ్‌ పేర్కొంది. మరోవైపు, ఫెయిర్‌ యూసేజీ పాలసీ (ఎఫ్‌యూపీ), ఫస్ట్‌ రీచార్జ్‌ కండీషన్‌ (ఎఫ్‌ఆర్‌సీ) వంటి విధానాలు అమలు చేసేటప్పుడు షరతులు, నిబంధనలను సవివరంగా తెలపకపోవడం లేదా తెలిపినా స్పష్టత లేకపోవడం వంటి అంశాల వల్ల యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని ట్రాయ్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సర్వీసులు మెరుగుపర్చడానికి టెల్కోలు ఇంకా ఏం చర్యలు తీసుకోవచ్చన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ టెలికం యూజర్లకు ట్రాయ్‌ సూచించింది. అభిప్రాయాలు పంపేందుకు తుది గడువు డిసెంబర్‌ 26 కాగా.. పరిశ్రమ వర్గాలు కౌంటర్‌ కామెంట్స్‌ సమర్పించేందుకు జనవరి 9 ఆఖరు తేదీగా ట్రాయ్‌ నిర్ణయించింది. కాగా, చార్జీలు పెంచాలని టెల్కోలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై జోక్యం చేసుకోరాదని ట్రాయ్‌ భావిస్తున్నట్లు సమాచారం.  

టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్‌ చైర్మన్‌ భేటీ..
వచ్చే ఏడాది (2020) దేశీ టెలికం రంగానికి సంబంధించిన అజెండా రూపకల్పనలో భాగంగా వొడాఫోన్‌–ఐడియా సీఈవో రవీందర్‌ టక్కర్‌ సహా వివిధ టెల్కోల చీఫ్‌లతో ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ సమావేశమయ్యారు. 2020లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు