ఎక్స్ క్లూజివ్ డేటా ప్యాక్: ఏడాదంతా

6 Jun, 2017 10:25 IST|Sakshi
ఎక్స్ క్లూజివ్ డేటా ప్యాక్: ఏడాదంతా
రోజుకో కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను మురిపిస్తున్న టెల్కోలకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఓ కొత్త సూచన చేసింది. మొబైల్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్ లో కనీసం ఒక్క డేటా ప్యాక్ అయిన ఏడాది కాలపరిమితితో తీసుకురావాలని పేర్కొంది. ఏడాది పాటు కాలపరిమితితో కూడిన డేటా ప్యాక్ లను ఆఫర్ చేసేందుకు టెల్కోలకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, కంపెనీలు మాత్రం దీర్ఘకాల వాలిడిటీ ప్యాక్ లవైపు తగిన శ్రద్ధ చూపడం లేదు.
 
గరిష్టంగా 90 రోజులున్న మొబైల్ డేటా ప్యాక్ ల పరిమితిని 365 రోజులకు పెంచుతూ రెగ్యులేటరి గత 10 నెలల క్రితమే తన ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపి 10నెలలు కావస్తున్నా చాలా కంపెనీలు ఏడాది ప్యాక్ లను ఆఫర్ చేయడం లేదు. ఇటీవలే దీర్ఘకాలిక మొబైల్ డేటా ప్యాక్ లు, స్పెషల్ టారిఫ్ ఓచర్లపై సమీక్ష చేపట్టిన ట్రాయ్,  ఈ విషయాన్ని నోటీసు చేసింది.
 
కొన్ని ఆపరేటర్లు మాత్రమే 365 రోజుల వాలిడిటీతో స్పెషల్ టారిఫ్  ఓచర్లు తీసుకొస్తున్నాయని, కానీ చాలా ఆపరేటర్లు ఉన్న డేటా బెనిఫిట్లనే తరువాతి రీఛార్జ్ లతో 12 నెలల వరకు పొడిగిస్తూ వెళ్తున్నాయని ట్రాయ్ గుర్తించింది. కానీ ఎలాంటి డేటా ఎస్టీవీలను 90రోజుల కంటే  ఎక్కువ వ్యవధిలో తీసుకురావడం లేదని ట్రాయ్ తెలిపింది. అన్ని టెలికాం సర్వీసు ప్రొవేడర్లు ఒకే పేమెంట్ విధానంతో కనీసం ఒక ఎస్టీవీనైనా తీసుకురావాల్సిందేనని ట్రాయ్ తాజాగా వారిని ఉద్దేశించి ఓ అడ్వైజరీ జారీచేసింది.
 
ఈ ప్యాక్ లో 365 రోజులకు ఎక్స్ క్లూజివ్ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పేర్కొంది. మరో నెల లేదా రెండు నెలలో దీనిపై సమీక్ష చేపడతామని, ఆపరేటర్లు స్పందించే తీరును బట్టి తదుపరిచర్యలు చేపడతామని ట్రాయ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగాన్ని పెంచడంతో పాటు తొలిసారి ఇంటర్నెట్‌ వినియోగించే వారిని ఆకర్షించేందుకు ట్రాయ్‌ దీన్ని తీసుకొచ్చింది. 
మరిన్ని వార్తలు