ఎస్‌బీఐ ఖాతా బదిలీ ఇక సులభతరం

17 Oct, 2017 12:42 IST|Sakshi

నెట్‌ బ్యాంకింగ్‌ ఉంటే చాలు

వారం రోజుల్లోపు బదిలీ పక్రియ పూర్తి

ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు

నిడమర్రు: ప్రైవేట్‌బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులు ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి జీతాల ఖాతాలు ఎస్‌బీఐ ఖాతాకు మార్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇటీవల ఎస్‌బీఐ స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ పేరుతో అనేక  రాయితీలు, సౌకర్యాలు ప్రకటించింది. అదే విధంగా ఇటీవల ప్రైవేట్‌ బ్యాంకులు ఆన్‌లైన్‌ సేవలను విస్తృతం చేస్తున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు ఎస్‌బీఐ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. తాజాగా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో ఆ బ్యాంక్‌ శాఖ మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు కైకరం బ్రాంచి మేనేజర్‌ వి.చక్రధరరావు తెలిపారు.

ఇంటి నుంచే..
సాధారణంగా ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకోవాలంటే మాతృశాఖకు వెళ్లి అర్జీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ శాఖకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఎస్‌బీఐ ఖాతా బ్రాంచ్‌ మార్చుకోవచ్చు. ఎస్‌బీఐలో ఉన్న ఖాతాలను ఆన్‌లైన్‌లో ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఖాతామార్పు ఇలా..
నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉన్న ఖాతాదారులు  www.onlinesbi.com వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ఈ–సర్వీసెస్‌ ఎంచుకుని ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ సేవింగ్‌ అకౌంట్స్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మీ ఖాతా నంబరు, బ్రాంచి వివరాలు వంటివి ప్రత్యక్షమవుతాయి.

ఎక్కువ ఖాతాలుంటే..
ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నా ఆ వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఏ అకౌంట్‌ను వేరే బ్రాంచీకి మార్చాలనుకుంటున్నారో అక్కడ కొత్త బ్రాంచ్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. కోడ్‌ ఆధారంగా బ్రాంచ్‌ పేరు కనిపిస్తుంది. కన్‌ఫర్మ్‌ బటన్‌పై నొక్కితే, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. తర్వాతి పేజీల్లో ఓటీపీ ఎంటర్‌ చేసి కన్‌ఫర్మ్‌ క్లిక్‌ చేయాలి. అక్కడ తెరపై వచ్చే సందేశంలో మీ బ్రాంచ్‌ ట్రాన్స్‌ఫర్‌ అభ్యర్థన విజయవంతమైనట్లు చూపిస్తుంది.

ఇవీ తప్పనిసరి
ఖాతా బదిలీ అవ్వాలంటే దాదాపు వారం రోజులు పడుతుంది. ఒక వేళ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు, ఆదాయపు పన్ను శాఖకు బదిలీచేస్తున్న ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఇచ్చి ఉంటే అక్కడ కొత్త ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ను అప్‌డేట్‌ చేయడం మరవకండి. ముఖ్యంగా ప్రైవేటు/ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాల ఖాతాలు మార్చుకునే విషయంలో కొత్త కోడ్‌ను మార్పుచేసుకోవాలి. ఈసీఎస్, స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ విషయంలో సైతం కోడ్‌ మార్చుకోవాల్సి ఉంటుంది.

బ్రాంచ్‌ కోడ్‌ సిద్ధం చేసుకోవాలి
ముందుగా ఖాతాదారుడు మారే కొత్త బ్రాంచి కోడ్‌ సిద్ధం చేసుకోవాలి. అలాగే పొదుపు ఖాతాల్లో మొబైల్‌ నంబరు రిజిస్టర్‌ అయి ఉంటేనే ఖాతా బదిలీ సాధ్యమవుతుంది. ఖాతా బదిలీ ఆన్‌లైన్‌లో చేయాలంటే ఖాతాదారునికి కచ్చితంగా నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉండాలి. కేవైసీ వివరాల వెరిఫికేషన్‌ పూర్తికాని, ఇన్‌ ఆపరేటివ్‌ ఖాతాలకు ఈ విధానంలో బ్రాంచి మార్పు సాధ్యం కాదు. – వి.చక్రధర రావు, మేనేజర్, ఎస్‌బీఐ కైకరం బ్రాంచి

మరిన్ని వార్తలు