‘క్రెడిట్‌’ బాకీలకు.. బదిలీ మందు!

29 Jan, 2018 01:31 IST|Sakshi

కార్డు బాకీ సకాలంలో చెల్లించకుంటే భారీ వడ్డీ

ఆ బకాయిలు వేరే కార్డుకు బదిలీ చేసుకుంటే నయం

అలాగైతే పరిమిత కాలం పాటు తక్కువ చార్జీలు

ఆ గడువు లోపు తిరిగి చెల్లించేస్తే బదిలీ లాభమే  

వరుసగా పండుగలు. ఇంటి నిండా బంధువులు. కొందరైతే పండగలకు ఊళ్లకు వెళ్లటం. ఏదైనా పండగలంటే అదనపు ఖర్చులు తప్పవు. ఆ సందడి, సంతోషాలతో పోలిస్తే ఖర్చులు పెద్ద లెక్కేమీ కావనుకోండి!!. క్రెడిట్‌ కార్డులున్నాయి కనక ఆ ఖర్చుల్ని అప్పటికప్పుడు తేలిగ్గానే అధిగమించేశారు. అంతా సవ్యంగా గడిచిపోయింది. కాకపోతే క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న రుణం తిరిగి చెల్లించాల్సిన గడువు రానే వచ్చింది.

ఇప్పుడేంటి పరిష్కారం...? సకాలంలో బకాయి చెల్లించకపోతే వడ్డీ మామూలుగా ఉండదనేది క్రెడిట్‌కార్డు వాడేవారికి తెలిసిన విషయమే. మరి వడ్డీ బాదుడు ఇష్టం లేని వారు, తమ దగ్గర తిరిగి చెల్లించేంత వెసులుబాటు కూడా లేనివారు ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కుని ఆ క్రెడిట్‌ కార్డు భారాన్ని దింపుకోవాలి కదా..?!! ఇదిగో... సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారికోసం ఓ ఆప్షన్‌ ఉంది. అది... ఆ బకాయిలను మరో క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసుకోవటం. – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

క్రెడిట్‌ కార్డు సంస్థలు కార్డుపై మిగిలి ఉన్న బకాయిని మరో కార్డుకు బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ...ఇలా బదిలీ చేసుకునే బకాయిలపై పరిమిత కాలం పాటు తక్కువ వడ్డీ చార్జీలను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, దీన్ని చేతిలో తగినన్ని డబ్బుల్లేనపుడు చేసుకునే తాత్కాలిక సర్దుబాటుగానే చూడాలి తప్ప శాశ్వత పరిష్కారంగా చూడకూడదనేది నిపుణుల సలహా.

బ్యాలెన్స్‌ బదిలీ కొంత కాలానికే...
బ్యాలెన్స్‌ బదిలీ ఆప్షన్‌ కింద ఒక కార్డుపై చెల్లించాల్సిన రుణ బకాయిలను మరో కార్డుకు బదలాయించుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న మొత్తంపై కొత్త సంస్థ కొన్నాళ్లపాటు తక్కువ చార్జీలే తీసుకుంటుంది. ఓ క్రెడిట్‌ కార్డు బ్యాలెన్స్‌ మొత్తాన్ని వాడేసి సకాలంలో చెల్లించకపోతే పడే వడ్డీ చార్జీల కంటే బదిలీ చేసుకునే బకాయిలపై ఆయా సంస్థలు విధించే వడ్డీ చార్జీలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు బకాయిల చెల్లింపులు ఆలస్యమైతే వాటిపై విధించే వడ్డీ చార్జీలు నెలవారీగా 2– 3.5 శాతం మధ్య ఉన్నాయి.

అదే బదిలీ చేసుకునే బకాయిలపై ఇదే సంస్థ కేవలం 0.99 శాతమే వసూలు చేస్తోంది. కాకపోతే ఈ సదుపాయం కొంత కాలం పాటే అమల్లో ఉంటుంది. చాలా బ్యాంకులు మూడు నుంచి ఆరు నెలల వరకే తక్కువ చార్జీల అవకాశం కల్పిస్తున్నాయి. ఈ పరిమిత కాలం ముగిసిన తర్వాత సాధారణ వడ్డీ చార్జీలు అమల్లోకి వస్తాయి. ఒక్క సిటీ బ్యాంకు మాత్రం బదిలీ చేసుకున్న బకాయిలపై తక్కువ వడ్డీ చార్జీలను 15 నెలల నుంచి 21 నెలల వరకు అమలు చేస్తోంది.

ఎలా పనిచేస్తుంది...?
కనీస అర్హతలుంటేనే బ్యాలెన్స్‌ బదిలీకి క్రెడిట్‌ కార్డు కంపెనీలు ఆమోదం తెలుపుతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు అయితే, ఇతర బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై కనీసం రూ.15,000 బకాయి ఉంటేనే ఆ మొత్తాన్ని బదిలీ చేసుకోవటానికి ఓకే చెబుతోంది. గరిష్ట బదిలీపై కూడా పరిమితులున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు సంస్థయితే బకాయిల మొత్తంలో 75 శాతాన్నే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుకు బదిలీ చేసుకునేందుకు అనుమతిస్తోంది. మిగిలిన 25 శాతం బకాయిలను కార్డు దారుడే సెటిల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

చెక్‌ లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ లేదా ఆన్‌లైన్‌లోనూ బ్యాలెన్స్‌ బదిలీకి ఎస్‌బీఐ అవకాశమిస్తోంది. ఇలా అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ బదిలీకి సాధారణంగా మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. ఒక్కసారి విధించే ప్రాసెసింగ్‌ చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులయితే వడ్డీ రేట్లు, కాల వ్యవధి, ప్రాసెసింగ్‌ ఫీజుల్లో కస్టమర్‌ ఇష్టానికి అనుగుణంగా పలు ఆప్షన్లను కూడా అందిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు సంస్థ రెండు ఆప్షన్లిస్తోంది.

60 రోజుల కాల వ్యవధిని ఎంపిక చేసుకుంటే బదిలీ చేసుకునే మొత్తంపై 2 శాతం లేదా రూ.199 వీటిలో ఏది ఎక్కువయితే దాన్ని వసూలు చేస్తోంది. వడ్డీ రేటు మాత్రం ఉండదు. మరో ఆప్షన్లో ఎస్‌బీఐ ఎటువంటి ప్రాసెసింగ్‌ చార్జీ తీసుకోదు. కాకపోతే బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ను 180 రోజుల కాల వ్యవధికి ఎంచుకుంటే నెలకు 1.7 శాతం చార్జ్‌ చేస్తోంది. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏ కార్డుకు అయితే బకాయిలను బదిలీ చేసుకున్నారో ఆ కార్డుపై క్రెడిట్‌ లిమిట్‌ ఆ మేరకు తగ్గిపోతుంది.

ఇవి గుర్తుంచుకోవాలి సుమా...
వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు బ్యాలెన్స్‌ బదిలీ అనేది మెరుగైన ఆప్షన్‌ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, తక్కువ వడ్డీ చార్జీలు అన్నవి పరిమిత కాలం పాటే ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ వ్యవధిలోపు చెల్లించలేకపోతే తిరిగి అధిక వడ్డీ చార్జీలను భరించాల్సి వస్తుంది. అయితే, బదిలీ చేసుకునే బకాయిలపైనే తక్కువ వడ్డీ చార్జీలు వర్తిస్తాయే గానీ ఆ కార్డుతో చేసే నూతన చెల్లింపులపై కాదు. ఒక్కసారే అయినా ప్రాసెసింగ్‌ ఫీజు విషయమూ పరిశీలించాలి. బ్యాలెన్స్‌ బదిలీపై ఉన్న అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత ఏది లాభదాయకం అనిపిస్తే దాన్ని అనుసరించడం మంచిది.

మరిన్ని వార్తలు