మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!

7 Mar, 2017 08:04 IST|Sakshi
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!

పిటిషన్లు చెల్లుబాటు కావన్న కంపెనీ లా ట్రిబ్యునల్‌
ముంబై: టాటా సన్స్‌పై న్యాయపోరాటంలో సైరస్‌ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్‌కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ  కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్‌ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ  కుటుంబానికి చెందిన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌... టాటాసన్స్‌ చైర్మన్‌గా  మిస్త్రీ తొలగింపును  ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేయడం తెలిసిందే.

 మైనారిటీ వాటాదారుల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించాయి. అయితే, విచారణ సందర్భంగా ఈ పిటిషన్లను టాటా సన్స్‌ వ్యతిరేకించింది. కంపెనీల చట్టం ప్రకారం మైనారిటీ వాటా కలిగిన పిటిషనర్లు ట్రిబ్యునల్‌ ముందు సవాల్‌ చేసే అవకాశం లేదని టాటా సన్స్‌ వాదించింది. కనీసం 10% వాటా కలిగి ఉండాలన్న అర్హతా ప్రమాణాల విషయంలో విఫలమైనందున ఈ పిటిషన్లు కొనసాగించగలిగినవి కావని ట్రిబ్యునల్‌ పేర్కొంది. దీనికి మిస్త్రీ కుటుంబ కంపెనీలు స్పందిస్తూ... జారీ మూలధనంలో పిటిషనర్‌ పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా లేదా మైనారిటీ వాటాదారుల్లో పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా చట్ట ప్రకారం ఈ నిబంధనను ట్రిబ్యునల్‌ రద్దు చేయవచ్చని పేర్కొన్నాయి.

అయితే, సైరస్‌ కుటుంబ కంపెనీలు రెండిం టికీ కలిపి మొత్తం జారీ మూలధనంలో 2.17% వాటాయే ఉందని, పిటిషన్లను దాఖలు చేసే సమయంలో అర్హత నిబంధనను రద్దు చేయాలని కోరకుండా,  ఈ దశలో అడగలేరని టాటా సన్స్‌ వాదించింది. ట్రిబ్యునల్‌ ముందు న్యాయపోరాటానికి కనీసం 10% వాటా  నిబంధనను రద్దు చేయాలన్న సైరస్‌  కంపెనీల అభ్యర్థనపై వాదనలను మంగళవారం వింటామని ట్రిబ్యునల్‌ బెంచ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు