ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక

23 Dec, 2014 00:54 IST|Sakshi
ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్... సర్వీసుల పునరుద్ధరణకు వీలుగా రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రణాళిక ఆమోదంపై తుది నిర్ణయం తీసుకునేముందు సంబంధిత చమురు కంపెనీలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సర్వీసుల పునరుద్ధరణ దిశలో  స్పైస్‌జెట్ ఇప్పటికే పౌర విమానయాన శాఖకు ప్రణాళికను అందజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు రుణ చెల్లింపులకు వీలుగా 15-30 రోజులపాటు గడువు ఇవ్వాల్సిందిగా చమురు కంపెనీలను కోరినట్లు తెలిపాయి.  కాగా, మరోపక్క కంపెనీ తొలి ప్రమోటర్ అజయ్ సింగ్ అమెరికాకు చెందిన రెండు ప్రయివేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ప్రతినిధులను కంపెనీ బోర్డులోకి తీసుకురావాలన్నది అజయ్ ప్రణాళిక.

రూ. 1,230 కోట్లకు బకాయిలు..:  చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బకాయిలు డిసెంబర్ 10కల్లా రూ. 1,230 కోట్లకు చేరాయి. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు 18 రోజుల్లో రూ. 990 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు ఎగశాయి. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ లోక్‌సభలో వెల్లడించారు.

మరిన్ని వార్తలు