పారదర్శక ట్రక్కులు.. !

24 Jun, 2015 00:39 IST|Sakshi
పారదర్శక ట్రక్కులు.. !

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : భారీ వాహనాలను ఓవర్‌టేక్ చేయడం ఎంత కష్టమో తెలియనిది కాదు. ప్రధానంగా ఒకే వరుస గల రహదారిలో (సింగిల్ లేన్) ఏమరుపాటుగా ఉన్నా, ఎదురుగా వస్తున్న వాహన వేగాన్ని అంచనా వేయకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇలాంటి సమస్యకు కొంతైనా పరిష్కారం చూపేందుకు టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ నడుం బిగించింది. భారీ వాహనానికి ముందువైపు కెమెరాలు, వెనుక వైపు టీవీ తెరను ఏర్పాటు చేసింది. కెమెరాల సహాయంతో వాహనానికి ముందు ఉన్న రోడ్డు, వెళ్తున్న వాహనాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

వెనుక నుంచి వచ్చే వ్యక్తులు ఈ స్క్రీన్ ద్వారా తాము ప్రయాణిస్తున్న రోడ్డును అంచనా వేయొచ్చు. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఈ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాంసంగ్ అంటోంది. ప్రస్తుతం ఈ ప్రొటోటైప్ టెక్నాలజీని అర్జెంటీనాలో కంపెనీ పరీక్షించింది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న దేశాల్లో అర్జెంటీనా 5వ స్థానంలో ఉంది. ఈ టెక్నాలజీ అమలయ్యేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలతో కలిసి శాంసంగ్ రంగంలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు