పేటీఎంకు పోటీగా ట్రూకాలర్‌..

13 Jun, 2018 20:09 IST|Sakshi
పేటీఎంకు పోటీగా ట్రూకాలర్‌, చిల్లర్‌

న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్‌ దిగ్గజం పేటీఎంకు పోటీగా ట్రూకాలర్‌ వచ్చేసింది. పేమెంట్స్‌ యాప్‌ చిల్లర్‌ను ట్రూకాలర్‌ కొనుగోలు చేసింది. చిల్లర్‌ యాప్‌ కొనుగోలుతో ట్రూకాలర్‌ కేవలం పేటీఎంకు మాత్రమే కాక, వాట్సాప్‌ పేమెంట్స్‌ సర్వీసులను భారత్‌లో ధీటుగా ఎదుర్కోబోతుంది. గతేడాది డిజిటల్‌ పేమెంట్‌ సెగ్మెంట్‌లోకి ట్రూకాలర్‌ ప్రవేశించిన అనంతరం భారత్‌లో ఈ కంపెనీ చేపట్టిన తొలి కొనుగోలు ఇదే కావడం విశేషం. దీంతో స్వీడన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం యూపీఐ ఆధారిత ట్రాన్సఫర్లను తన యాప్‌లో అనుమతించనుంది. ట్రూకాలర్‌ పే 2.0 లాంచ్‌తో తన యాప్‌లో బ్యాంకింగ్‌, పేమెంట్స్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

వచ్చే నెలల్లో క్రెడిట్‌, ఇతర ఫైనాన్సియల్‌ సర్వీసులను అందించాలని కూడా  ట్రూకాలర్‌ ప్లాన్‌ చేస్తోంది.  చిల్లర్‌ వ్యవస్థాపకులు సోనీ జాయ్‌, అనూప్‌ సర్కార్‌, మహ్మద్‌ గలీబ్‌, లిషోయ్‌ భాస్కరన్‌లతో పాటు ఆర్గనైజేషన్‌లో మిగతా ఉద్యోగులు ట్రూకాలర్‌లో చేరబోతున్నారు. సోనీ జాయ్‌ ట్రూకాలర్‌ పే సంస్థకు వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. చిల్లర్‌ కొనుగోలుతో, తాము మొబైల్‌ చెల్లింపులకు ఎంతో నిబద్ధతను కలిగి ఉన్నామని పునరుద్ఘాటిస్తున్నామని, యూజర్‌ బేస్‌ను తాము బలపరుచుకోనున్నామని ట్రూకాలర్‌ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ నామి జరింఘలం అన్నారు. గతేడాది నుంచి చిల్లర్‌ తన యాప్‌ను విక్రయించడానికి చూస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చిల్లర్‌కు అతిపెద్ద భాగస్వామి.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా