షిర్డీకి ట్రూజెట్‌ విమాన సర్వీసులు

18 May, 2017 01:47 IST|Sakshi
షిర్డీకి ట్రూజెట్‌ విమాన సర్వీసులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమాన సర్వీసుల రంగంలో ఉన్న ట్రూజెట్‌ షిర్డీలో అడుగు పెట్టబోతోంది. విమానాలను నడిపేందుకు కావాల్సిన అనుమతిని ఈ నెల చివరికల్లా షిర్డీ విమానాశ్రయం దక్కించుకోనుంది. ఇదే జరిగితే జూన్‌ నుంచి సర్వీసులు మొదలు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రూజెట్‌ను ప్రమోట్‌ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ఎండీ వంకాయలపాటి ఉమేష్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు బుధవారం తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రమైన షిర్డీకి విమానంలో వెళ్లేందుకు అత్యధికులు మొగ్గుచూపుతారని ఆయన చెప్పారు. బిజీ రూట్లలో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు. తొలుత హైదరాబాద్‌–షిర్డీ మధ్య ప్రతి రోజు రెండు సర్వీసులు, రాజమండ్రి–షిర్డీకి ఒక సర్వీసు నడిపిస్తామని వెల్లడించారు.

మెట్రోల నుంచి చిన్న నగరాలకు..
టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు పౌర విమానయాన శాఖ నుంచి షెడ్యూల్డ్‌ కమ్యూటర్‌ ఆపరేటర్‌ కింద ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికేట్‌ లభించింది. తద్వారా మెట్రో నగరాల నుంచి దేశవ్యాప్తంగా చిన్న నగరాలకు విమానాలను నడిపేందుకు కంపెనీకి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం ట్రూజెట్‌ 11 కేంద్రాలకు విమానాలను నడిపిస్తోంది. ముంబై–నాందేడ్‌ మార్గంలో మే నుంచే సర్వీసులు మొదలు పెడతామని ఉమేష్‌ తెలిపారు. డిసెంబరులోగా నాలుగు కొత్త నగరాలను జోడిస్తామని పేర్కొన్నారు. సంస్థ వద్ద ఏటీఆర్‌–72 రకం నాలుగు విమానాలున్నాయి. ఈ ఏడాది మరో రెండు ఎయిర్‌క్రాఫ్టస్‌ జతకూడనున్నాయి.
 

>
మరిన్ని వార్తలు