భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు

10 Jul, 2019 05:33 IST|Sakshi

మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్‌ ఎంతో కాలంగా అమెరికన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించేది లేదంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. గత నెల 28న జీ–20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్, మన దేశ ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రంప్‌ భారత్‌ పట్ల తన కఠిన వైఖరిని మరోసారి తన మాటల ద్వారా ప్రదర్శించుకున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌రాస్, ఇంధన మంత్రి రిక్‌పెర్రీ ఈ వారం చివర్లో వాషింగ్టన్‌లో భారత్‌కు సంబంధించి జరిగే ఓ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంలో ట్రంప్‌ వ్యూహాత్మకంగా భారత్‌ టారిఫ్‌లపై మరోసారి మాట్లాడడం గమనార్హం. గత నెలలో అమెరికాకు చెందిన బాదం, యాపిల్‌ సహా 28 ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు పెంచుతూ        నిర్ణయాన్ని అమలు చేసింది. గతేడాది మన దేశ అల్యూమినియం, స్టీల్‌ దిగుమతులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా అమలు చేసింది. ఇది       తమకు ఆమోదం కాదని, భారత్‌ అమెరికాకు     వ్యతిరేకంగా ఎక్కువ టారిఫ్‌లను అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నట్టు జీ20 దేశాల సమావేశానికి ముందు ట్రంప్‌ ట్వీట్‌ చేయడం తెలిసిందే. హార్లే డేవిడ్సన్‌ బైకులపై భారత్‌ భారీ టారిఫ్‌లు విధిస్తోందని అంతకుముందు పలు సందర్భాల్లోనూ ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు