సినిమాల నిర్మాణానికి టర్కీ రాయితీలు

4 Oct, 2016 01:18 IST|Sakshi
సినిమాల నిర్మాణానికి టర్కీ రాయితీలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే దిశగా టర్కీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తమ దేశంలో చిత్రీకరించే సమయంలో చేసే వ్యయాలపై దాదాపు 18% దాకా పన్ను రీఫండ్ ఇస్తున్నట్లు టర్కీ టూరిజం శాఖలో భాగమైన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ కోఆర్డినేటర్ ఒజ్గుర్ అయ్‌టుర్క్ తెలిపారు. అలాగే, చిత్ర నిర్మాణ సామగ్రి సత్వర కస్టమ్స్ క్లియరెన్స్, చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక మొదలైన వాటిలో తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు.

భారత్‌లో 8 నగరాల్లో తలపెట్టిన రోడ్ షోలలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒజ్గుర్ ఈ అంశాలు చెప్పారు. దిల్ ధడక్‌నేదో, ఏక్ థా టైగర్ తదితర బాలీవుడ్ సినిమాలు టర్కీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. మరోవైపు, గతేడాది మొత్తం 2.6 కోట్ల మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించగా వీరిలో 1.31 లక్షల మంది భారత టూరిస్టులు ఉన్నారని ఒజ్గుర్ తెలిపారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈసారి కొంత తగ్గినా.. వచ్చేసారి భారత టూరిస్టుల సంఖ్య 20 శాతం పైగా వృద్ధి చెందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం ద్వారా 31 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందన్నారు.

మరిన్ని వార్తలు