బ్యాంక్ షేర్ల భారీ ర్యాలీ

3 Mar, 2016 01:16 IST|Sakshi
బ్యాంక్ షేర్ల భారీ ర్యాలీ

ఆర్‌బీఐ మూలధన నిబంధనల సరళీకరణ ప్రభావం
24,000 పాయింట్ల పైకి సెన్సెక్స్
464 పాయింట్ల లాభంతో
24,243 వద్ద ముగింపు

బడ్జెట్ జోరు వరుసగా రెండో రోజూ కొనసాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. మూలధన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించడంతో బ్యాంక్ షేర్లు దూసుకుపోయాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ రూపాయి బలపడడం కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 24,000 పాయింట్లు, ఎన్‌ఎన్‌సీ నిఫ్టీ 7,350 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ 464 పాయింట్లు (1.95 శాతం)లాభపడి 24,243 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 147 పాయింట్లు (2.03 శాతం)లాభపడి 7,369 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది దాదాపు నెల గరిష్ట స్థాయి.

 ఇంట్రాడేలో 500 పాయింట్ల లాభం ...
ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పాయింట్ల లాభ పడింది.గత రెండు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 1,240 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ఈ స్థాయిలో లాభపడడం ఏడేళ్లలో దాదాపు  ఇదే మొదటిసారి. బడ్జెట్‌పై మార్కెట్‌కు గురి కుదిరిందని, అధ్వాన పరిస్థితులు ముగిసిపోయినట్లు మార్కెట్ భావిస్తోందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఈసీబీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ల దన్నుతో ఈ నెలలో మార్కెట్ లాభాల బాట పడుతుందని వివరించారు. బ్యాంకులు మంచి స్థితిలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి భరోసా ఇవ్వడం, నిర్దేశించుకున్న స్థాయిల్లోనే ద్రవ్యలోటును సాధించగలమన్న ప్రభుత్వ అంకితభావం, ఈ నెలలో ఎప్పుడైనా ఆర్‌బీఐ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు పెరిగి ఏడు వారాల గరిష్ట స్థాయికి చేరడం, గత కొన్ని రోజులుగా విక్రయాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరపడం .,    సానుకూల ప్రభావం చూపించాయి.

 ఎస్‌బీఐ 12 శాతం అప్..
బాసెల్ త్రి నిబంధనలను మన బ్యాంక్‌లు అందుకునేలా మూలధన నిబంధనల్లో ఆర్‌బీఐ వెసులుబాటునివ్వడంతో బ్యాంక్ షేర్లు లాభాల ర్యాలీని జరిపాయి.  ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ 12 శాతం లాభపడి రూ.181 వద్ద ముగిసింది. 2009, మే తర్వాత ఎస్‌బీఐ ఒక్క రోజులో ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి.  సెన్సెక్స్‌లో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. కాగాఅమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ ప్రభావం కూడా భారత్ స్టాక్ మార్కెట్‌పై పడింది.

మరిన్ని వార్తలు