తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

10 Oct, 2019 14:02 IST|Sakshi

పీఎంసీ కుంభకోణంలో చిక్కుకున్న టీవీ నటి నూపుర్‌ అలంకార్‌

అప్పుల కోసం నగల విక్రయం

సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణంలో ఒక్కోఖాతాదారుడిదీ ఒక్కోదీన గాధ. పండుగ సందర్భంలో కుటుంబాలతో సంతోషంగా ఎలా గడపాలంటూ బాధిత ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకోట్ల కుంభకోణం వెలుగు చూడటంతో ఆర్‌బీఐ పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అంతేకాదు వెయ్యి రూపాయలకు మించి ఏ ఖాతాదారుడు నగదు తీసుకోవడానికి వీల్లేదని పరిమితులు విధించింది. ఆ తరువాత బాధితుల ఆందోళనతో ఈ లిమిట్‌ను 25వేలకు పెంచింది. అయినప్పటికీ  ఉన్నట్టుండీ తమ ఖాతాల్లోని నగదు స్తంభించిపోవడంతో... కూతురి పెళ్లి ఎలా అని, అమ్మాయి ఫీజు ఎలా కట్టాలి, అమ్మా నాన్న, వైద్య ఖర్చులు..ఇలా  ఒక్కొక‍్కరూ వర్ణించనలవి కాని ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పలుమార్లు ఆందోళనకు దిగారు. తాజాగా ముంబైలోని బీజేపీ కార్యాలయం ముందు వందలాదిమంది నిరసనకు దిగారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ పలు మీడియా సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో ఆందోళనకారులు ఆమెను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని ను కోరారు. 

ప్రధానంగా టీవీ నటి నూపుర్‌ అలంకార్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిజంగా సినిమా కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. అమ్మ ఆక్సిజన్‌పై చావుబతుకులమధ్య ఉన్నారు. మామగారు ఈ మధ్యనే ఆపరేషన్‌ అయింది.. దానికి సంబంధించిన బకాయిలు కట్టాల్సి వుందని నూపుర్‌ మీడియాతో వాపోయారు. తన ఖాతా స్థంభించిపోవడంతో  నగలు అమ్మాల్సి వచ్చిందని తెలిపారు.  ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే.. ఇక​ ఇంట్లో వస్తువుల్ని కూడా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు  పీఎంపీ కుంభకోణం వ్యవహారంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థికమంత్రిగా తానేమీ చేయలేననీ, రెగ్యలేటరీ అయిన ఆర్‌బీఐ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. అయితే ఖాతాదారులు, ఆందోళనను అర్థం చేసుకోగలమని, వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ (గురువారం) సాయంత్రం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. అలాగే పరిస్థితిపై వివరంగా అధ్యయనం చేయమని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కోరాననీ, ఇందులో ఆర్‌బిఐ ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. అంతేకాదు అవసరమైతే, సంబంధిత చట్టాలను సవరించాల్సిన మార్గాలను  అన్వేషించమని ఆదేశించినట్టు నిర్మలా సీతారామన్‌  చెప్పారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా