1 శాతం తగ్గిన టీవీఎస్‌ మోటార్‌ లాభం

24 Oct, 2018 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో 1 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.211 కోట్లకు తగ్గిందని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తెలిపింది.మొత్తం ఆదాయం రూ.4,098 కోట్ల నుంచి రూ.4,994 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ చెప్పారు. ఈ క్యూ2లో ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 14 శాతం వృద్ధితో 10.49 లక్షలకు పెరిగాయని వివరించారు. ఒక్కో  షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ (210 శాతం) ఇవ్వనున్నామని తెలిపారు.  మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.120 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు.  

18 శాతం పెరిగిన ఎబిటా  
ఎబిటా 18 శాతం వృద్ధితో రూ.428 కోట్లకు పెరిగిందని రాధాకృష్ణన్‌ తెలిపారు.  అయితే నిర్వహణ మార్జిన్‌ 8.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసం రూ.800 కోట్లు మూలధన పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం మూలధన పెట్టుబడులు (రూ.450 కోట్లు)తో పోల్చితే ఇది 78 శాతం అధికమని తెలిపారు.  

బీమా గందరగోళం...
మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 4.20 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 18 శాతం వృద్ధితో 3.88 లక్షలకు పెరిగాయని రాధాకృష్ణన్‌ తెలిపారు. మొత్తం ఎగుమతులు 35 శాతం ఎగసి 1.48 లక్షలకు చేరాయని పేర్కొన్నారు. థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియమ్‌ విషయమై వినియోగదారుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. ఎంట్రీ లెవల్‌ బైక్‌ల విషయంలో బీమా వ్యయాలు బైక్‌ ధరల్లో 10 శాతంగా ఉన్నాయని, అందుకే చాలా మంది  వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారని వివరించారు. దీపావళి పండగ కారణంగా అమ్మకాలు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీఎస్‌ మోటార్‌ షేర్‌ 3.7 శాతం లాభంతో రూ.536 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు