కస్టమర్ ఈజ్ కింగ్ : విజయరాఘవన్‌ ఇక లేరు

9 Jul, 2020 18:01 IST|Sakshi

టీవీఎస్ శ్రీచక్ర డైరెక్టర్ విజయరాఘవన్ కన్నుమూత

సాక్షి, చెన్నై: టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ (టీవీఎస్ టైర్స్) డైరెక్టర్‌ పీ విజయరాఘవన్ (72) గుండెపోటుతో నిన్న(బుధవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా టీవీఎస్ గ్రూప్ కంపెనీలకు  విశేష సేవలందించారు. టీవీఎస్ శ్రీచక్రా కంపెనీ స్థాపించినప్పటి నుంచీ కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, తుది శ్వాసవరకు బోర్డులో డైరెక్టర్‌గా చురుకుగా ఉన్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

21 సంవత్సరాల వయస్సులో 1969లో సుందరం ఇండస్ట్రీస్‌లో చేరిన విజయరాఘవన్ ఐదు దశాబ్దాలకు పైగా టీవీఎస్ గ్రూపునకు సేవలందించారు. ఖరగ్‌పూర్ ఐఐటి నుంచి కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్, రబ్బరు టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన విజయరాఘవన్ రబ్బరు పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు. అనేక పరిశ్రమ సంస్థలలో చురుకైన సభ్యుడిగా, ఈ రంగ వృద్ధికి కీలక  భూమికను నిర్వహించారు. విజయరాఘవన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. ‘కస్టమర్ ఈజ్ కింగ్ ’ అనే నినాదంతో భారీ మార్కెట్‌ ను క్రియేట్‌ చేశారనీ. 1980, 1990ల నాటి  కస్టమర్లు ఇప్పటికీ తమతోనే ఉన్నారని కంపెనీ  సీనియర్ అధికారి తెలిపారు.

కాగా టీవీఎస్ గ్రూపులో భాగమైన టీవీఎస్ శ్రీచక్రా లిమిటెడ్ టూ, త్రీవీలర్ల టైర్లు, ఆఫ్-హైవే టైర్ల తయారీలో ప్రముఖమైనది. మదురై, ఉత్తరాఖండ్‌లో ఉన్న రెండు ఉత్పాదక   ప్లాంట్ల ద్వారా ప్రతి నెలా మూడు మిలియన్ల టైర్లను ఉత్పత్తి చేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు  టైర్లను ఎగుమతి చేస్తుంది.

మరిన్ని వార్తలు