ఏడాదిలో 25 కంట్రీ క్లబ్స్‌

31 May, 2017 00:26 IST|Sakshi
ఏడాదిలో 25 కంట్రీ క్లబ్స్‌

శంషాబాద్, వైజాగ్, విజయవాడల్లో విస్తరణ
స్థానిక సంస్థలతో కలిసి లండన్, అమెరికాల్లో కూడా..
6 నెలల్లో ఓ విమానయాన సంస్థతో ప్రత్యేక ఒప్పందం
మూడేళ్లలో 10 లక్షల మంది సభ్యుల లక్ష్యం
గతేడాది రూ.500 కోట్ల టర్నోవర్‌; ఈ ఏడాది 25% వృద్ధి లక్ష్యం
కంట్రీ క్లబ్‌ సీఎండీ వై రాజీవ్‌ రెడ్డి


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
హైదరాబాద్‌ కేంద్రంగా హాస్పిటాలిటీ మరియు హాలిడేస్‌ రంగంలో కొనసాగుతున్న కంట్రీ క్లబ్‌... ఈ ఏడాది భారీ విస్తరణ ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం దేశీయంగాను, సింగపూర్, దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్‌ వంటి 10 దేశాల్లో 55 సొంత ప్రాపర్టీలు ఉన్నాయి. వీటికి తోడుగా మరో 25 కంట్రీ క్లబ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఎండీ వై రాజీవ్‌ రెడ్డి మంగళవారం ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’కు తెలిపారు.

ఇందులో లండన్, అమెరికాల్లో ఒక్కో ప్రాపర్టీ మినహా మిగిలినవన్నీ మన దేశంలోనే మరీ ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్నాయని చెప్పారు. ‘‘శంషాబాద్‌ దగ్గర్లో కొంత భూమి ఉంది. అందులో తొలుత క్లబ్‌ను ఏర్పాటు చేస్తాం. తర్వాత విశాఖ, విజయవాడ నగరాలకు విస్తరిస్తాం. విదేశాల్లో అయితే లండన్‌లో స్థానికంగా ఉండే ఓ ప్రాపర్టీతో 15 ఏళ్ల లీజింగ్‌ ఒప్పందం చేసుకున్నాం. ఆ తర్వాత అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు విస్తరిస్తాం. వీటికి పెట్టుబడులెంతనేది ఇంకా నిర్ణయించలేదు. లీజింగ్‌ విధానంలో సేవలు విస్తరిస్తాం కనక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ అవసరం ఉండదు’’ అని ఆయన వివరించారు.

25 శాతం వృద్ధి లక్ష్యం...
క్లబ్స్, హాలిడేస్, ఈవెంట్స్, ఫిట్‌నెస్‌  విభాగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కంట్రీ క్లబ్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ను సాధించిందని, మొత్తం ఆదాయంలో 35 శాతం విదేశాల నుంచే వస్తోందని రాజీవ్‌రెడ్డి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 25 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని, త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారాయన. ప్రస్తుతం 5 లక్షల మంది సభ్యులున్న కంట్రీ క్లబ్‌లో వచ్చే 3 ఏళ్లలో 10 లక్షల మంది సభ్యుల్ని చేర్చాలని లక్ష్యించామన్నారు. కొత్తగా కంట్రీ క్లబ్‌లో సభ్యత్వం తీసుకునే వారికి ఐఫోన్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

త్వరలో ఓ విమానయాన సంస్థతో ప్రత్యేక ఒప్పందం చేసుకోనున్నామని, దీనివల్ల కంట్రీ క్లబ్‌ సభ్యులకు డిస్కౌంట్‌ ధరలకు విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వీలు కలుగుతుందని తెలియజేశారు. ‘‘కంట్రీ క్లబ్‌ సేవలను నెలవారీ వాయిదా పద్ధతుల్లోనూ వినియోగించుకునేందుకు వీలుగా దేశంలో 11 ప్రధాన బ్యాంకులతో, విదేశాల్లో 3 బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. కస్టమర్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కస్టమర్‌ సెంట్రిక్‌ క్లియరెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు.

>
మరిన్ని వార్తలు