షాకింగ్‌ : ట్విటర్‌ సీఈవో దగ్గర ల్యాప్‌టాప్‌ లేదట!

28 May, 2018 11:59 IST|Sakshi
ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే(ఫైల్‌ ఫోటో)

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ తెలుసుగా.. ఈ కంపెనీకి సీఈవో అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు. ఆయన వాడని గాడ్జెట్స్‌ అంటూ ఉండవు. ఆయన దగ్గర లేని వస్తువంటూ ఉండదు. కానీ ట్విటర్‌ సీఈవోగా పనిచేస్తున్న జాక్‌ డోర్సే ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. అది వింటే మీరు షాక్‌ అవ్వాల్సిందే. డోర్సే దగ్గర ల్యాప్‌టాప్‌ లేదట. ప్రపంచాన్ని ఏలే ఓ అతిపెద్ద టెక్‌ కంపెనీ సీఈవో ల్యాప్‌టాప్‌ లేకపోవడమేంటని చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నిజంగానే జాక్‌ డోర్సే దగ్గర ల్యాప్‌టాప్‌ లేదట. దీనికి గల కారణం ఆయన ల్యాప్‌టాప్‌ వాడకపోవడమేనట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ల్యాప్‌టాప్‌ వాడననని, ప్రతీది తన ఫోన్‌ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్‌లైన్‌ సెక్యురిటీ ప్రాక్టిస్‌ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే  ఈ విషయాన్ని రివీల్‌ చేశారు. 

నోటిఫికేషన్లన్నింటినీ ఆపివేసి, ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానని, తన ముందున్న దానిపైనే దృష్టిపెట్టడం తనకు అలవాటని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌పై అన్ని ఒకేసారి చేయడం కంటే ఇదే బెస్ట్‌ అని చెప్పారు. అయితే చిన్న ఫోన్‌ స్క్రీన్‌పై టైప్‌ చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించగా.. ల్యాప్‌టాప్‌లాగా ఫోన్‌ను వాడటానికి పలు వాయిస్‌ టైపింగ్‌ టూల్స్‌ ఉన్నాయన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్‌ కంపెనీని నిర్వహించడమే కాకుండా.. తన డిజిటల్‌ జీవితాన్ని, నిజ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ.. పలువురి మన్ననలు పొందుతున్నారు. ప్రైవసీ, సెక్యురిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని, మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్‌ గురించి తెలుసుకుని ఉండాలని చెప్పారు. 2015లో జాక్‌ డోర్సే రెండోసారి ట్విటర్‌ సీఈవోగా ఎంపికయ్యారు.    
 

మరిన్ని వార్తలు