ట్విట్టర్ భలే బీట్ చేసింది!

26 Apr, 2017 17:15 IST|Sakshi
ట్విట్టర్ భలే బీట్ చేసింది!
ట్విట్టర్ తెలియని వారెవరూ ఉండరు. సామాజిక మాధ్యమంలో దీనికెంతో పేరుంది. అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్ల బేస్ తగ్గి, లాభాలు రాక, నష్టాల్లో మునిగితేలుతోంది. ఈ కంపెనీని అమ్ముదామనుకుని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆర్థిక నష్టాలను తలకెత్తుకోవడానికి ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా ఎన్నో క్వార్టర్లలో నిరాశపరిచే ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్ మొదటిసారి అంచనాలను అధిగమించింది. ఆదాయాలు, రాబడులలో అంచనావేసిన దానికంటే మెరుగ్గా బుధవారం తన ఫలితాలను ప్రకటించింది.  ఈ కంపెనీ యాక్టివ్ యూజర్ల బేస్ నెలకు 328 మిలియన్లకు చేరినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడా 9 మిలియన్లు ఎక్కువట.
 
అదేవిధంగా కంపెనీ రెవెన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేరుపై ఆర్జించే ఆదాయం కూడా 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండూ వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేరుపై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా రెవెన్యూలు కూడా 511.9 మిలియన్ డాలర్లుగానే ఉంటాయని తెలిపారు. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది.  రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే డైలీ యాక్టివ్ యూజర్ నెంబర్ ను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫలితాల ప్రకటనాంతరం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 11 శాతం పైకి ఎగిశాయి.  ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి, సంభాషణ కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులను చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చ్, బ్రౌజ్, లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచామన్నారు. 
మరిన్ని వార్తలు