చోర్..చోర్ కామెంట్లపై మాల్యా స్పందన

13 Jun, 2017 20:11 IST|Sakshi
చోర్..చోర్ కామెంట్లపై మాల్యా స్పందన
ప్రజల సొమ్ముని ఎగ్గొట్టి దర్జాగా యూకేలో బతుకుతున్న విజయ్ మాల్యాకు ఇటీవల ఓవెల్ క్రికెట్ మైదానంలో ఎదురైన తీవ్ర పరాభవం తెలిసిందే. క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టిన మాల్యాను చూసి అక్కడున్న వారందరూ చోర్.. చోర్(దొంగ.. దొంగ) అంటూ ఆయనను చుట్టుముట్టి గేళి చేశారు. ఊహించని పరిణామంలో షాక్‌ తిన్న మాల్యా, ఈ పరిణామంపై నేడు లండన్ కోర్టుకు హాజరయ్యే ముందు స్పందించారు.  
 
ఓవెల్ మైదానంలో తనను ఎవరూ దొంగా అని అనలేదని చెప్పుకొచ్చారు.  తప్పతాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనపై అరిచారని, మిగతావారందరూ తన వద్దకు వచ్చి మంచి జరగాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద తనను అవమానించారనే మీడియా వార్తలను మాల్యా కొట్టిపారేశారు. అయితే విజయ్ మాల్యా ఈ విషయం చెప్పగానే, ఆయనపై అరిచిన ఆ ఇద్దర్ని ట్విట్టరియన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ ఇద్దరికి సెల్యూట్ చేయాలని ట్వీట్లు చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన మాల్యా  యూకేలో దర్జాగా  బతుకుతున్నారు. 
 
నేడు లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో మాల్యాను భారత్ కు అప్పగించే కేసు విచారణ జరిగింది. ఈ విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జూలై 6కు వాయిదా పడింది. మాల్యాకు మంజూరు చేసిన బెయిల్ ను కూడా కోర్టు మరో ఆరునెలలు(డిసెంబర్‌ దాకా) వరకు పొడిగించింది. కోర్టుకు హాజరయ్యే ముందు మాల్యా తను నిర్దోషినని, ఎలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. 
మరిన్ని వార్తలు