టూ వీలర్స్‌పై భారీ డిస్కౌంట్స్‌

31 Mar, 2017 00:05 IST|Sakshi
టూ వీలర్స్‌పై భారీ డిస్కౌంట్స్‌

ఈ అవకాశం ఈ ఒక్క రోజే
మార్చి 31 తర్వాత బీఎస్‌ – 3 వాహనాలు బంద్‌ l
సుప్రీంకోర్టు తీర్పుతో తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన హోండా, హీరో, బజాజ్, సుజుకి l
ద్విచక్ర వాహనం రూ.22,000 వరకు చౌక  


న్యూఢిల్లీ: స్కూటర్, బైక్‌ ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనాలన్న ఆలోచన ఉంటే ఆ ముహూర్తమేదో ఈ రోజే పెట్టేసుకోండి. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా... వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. బీఎస్‌ – 3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాటిని ఏప్రిల్‌ 1 నుంచి విక్రయించడం, రిజిస్ట్రేషన్‌ కుదరదని అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పుతో ఆ వాహన నిల్వలను క్లియర్‌ చేసుకోవడంపై వాహన తయారీ సంస్థలు దృష్టి సారించాయి.

 ద్విచక్ర వాహనాలపై రూ.22వేల రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం, అదీ శుక్రవారం ఒక్కరోజే అందుబాటులో ఉంటుంది. స్టాక్స్‌ మిగిలి ఉన్నంత వరకు లేదా మార్చి 31 వరకే ఆ ఆఫర్లు అమల్లో ఉంటాయని కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య వాహన కంపెనీలు సైతం బీఎస్‌–3 యూనిట్లపై కొంత మేర తగ్గింపును అందిస్తున్నట్టు తెలియవచ్చింది. మార్చి 31న కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్, ఇతర ధ్రువీకరణలతో ఆ తేదీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అనుమతి ఉంది.

 డీలర్ల తగ్గింపు మరికొంత...
వాస్తవానికి మార్చి 31తో తమ దగ్గర మిగిలిపోయే వాహనాల విషయమై కంపెనీల నుంచి డీలర్లకు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తమ దగ్గరున్న వాహన స్టాక్‌ను క్లియర్‌ చేసుకునేందుకు... కంపెనీలు అందించే డిస్కౌంట్‌కు అదనంగా తాము సైతం కొంత తగ్గింపును అందించేందుకు డీలర్లు ముందుకు వస్తున్నారు. అయితే, బజాజ్‌ మాత్రం మిగిలిపోయిన ప్రతీ ఒక్క వాహనాన్ని వెనక్కి తీసుకుంటామని తమ డీలర్లకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

6.71 లక్షల వాహనాలు
బీఎస్‌ – 3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆఖరి రోజైన మార్చి 31లోపు వీలైనన్నింటినీ విక్రయించుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించినట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఒక్క హీరో మోటో కార్ప్‌ కంపెనీ పరిధిలోనే 2 లక్షల వాహనాలున్నాయని అంచనా. టాటా మోటార్స్‌ కంపెనీకి బీఎస్‌ –3 యూనిట్లు 30,000 వరకు ఉన్నాయి. అన్ని రకాల కార్లను కంపెనీలు బీఎస్‌–4 ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నాయి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రక్కులు, బస్సులే బీఎస్‌ –3 ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుతం విక్రయమవుతున్నాయి.

 ఊహించని రాయితీలు: డీలర్లు
ద్విచక్ర వాహన పరిశ్రమలో  ఎప్పుడూ వినని తగ్గింపు ధరలుగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ (ఎఫ్‌ఏడీఏ) మాజీ ప్రెసిడెంట్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌ నికుంజ్‌ సంఘి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా అనుసరించనున్నారు అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే తమ శక్తిని కేంద్రీకరించామని చెప్పారు. కొనుగోలుకు అవకాశం ఉన్న కస్టమర్లకు కాల్స్‌ చేసి మరీ ఆఫర్ల గురించి తెలియజేస్తున్నట్టు తెలిపారు. బీఎస్‌ –3 వాహనాల నిల్వలను విక్రయించుకునేందుకు కోర్టు మరింత సమయం ఇస్తుందని ఆశించామని, కానీ అది జరగనందున ఉన్న వాటిని అమ్ముకోవడంపై దృష్టి పెట్టామన్నారు. గడువు తర్వాత మిగిలి ఉన్న వాహనాల విషయమై తయారీదారులతో మాట్లాడాల్సి ఉందన్నారు.  
 
 తగ్గింపు ఎందుకు...?
మిగిలి ఉన్న వాహనాలను కంపెనీలు ఏప్రిల్‌ 1 తర్వాత విక్రయించడానికి వీల్లేదు. వాటిని విదేశీ మార్కెట్లలో అమ్ముకోవడం ఒక్కటే వాటి ముందున్న మార్గం. విదేశాలకు ఎగుమతి చేయడం కొంత ఖర్చుతో కూడుకున్నది. అదే సమయంలో స్థానిక మార్కెట్లో ఉన్నంత విక్రయాలు విదేశీ మార్కెట్లలో ఉండకపోవచ్చు. ఆ స్టాక్‌ను వదిలించుకునేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఇదంతా కంపెనీలపై భారాన్ని పెంచేవే. అదేదో ఇక్కడే కొంత డిస్కౌంట్‌ ఇవ్వడం వల్ల వాహన నిల్వలను తగ్గించుకోవచ్చని కంపెనీలు భావించి ఉండొచ్చు.

 వాణిజ్య వాహనాలపై తగ్గింపు ఎంత..?
బీఎస్‌ –3 ప్రమాణాలతో ఉన్న వాణిజ్య వాహనాల నిల్వలు తక్కువే ఉండడంతో వీటిపై భారీ ఆఫర్లకు కంపెనీలు ముందుకు రానట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రక్కులు, బస్సులపై 4 నుంచి 12 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు సమాచారం.

తిరిగి కస్టమర్‌∙మీదే భారం?
బీఎస్‌–3 ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులతో ముందుకు వచ్చిన సంస్థలు ఆ భారాన్ని గడువు తర్వాత తిరిగి కస్టమర్ల మీదే రుద్దనున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తగ్గింపుల వల్ల ఎదురయ్యే నష్టాన్ని అవి తర్వాత బీఎస్‌ –4 మోడళ్లపై కొద్ది మేర రేట్లను పెంచడం ద్వారా భర్తీ చేసుకునే
అవకాశం లేకపోలేదన్నది పరిశీలకుల అభిప్రాయం.

వాహనాలు ఇట్టే అమ్ముడవుతాయి..  
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బీఎస్‌–3 ద్విచక్ర వాహనాలపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో అమ్మకాలు బాగా పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో డీలర్‌ వద్ద 200–300 దాకా వాహనాలు ఉన్నట్టు తెలియవచ్చింది. భారీ డిస్కౌంట్ల కారణంగా ఇవన్నీ ఒక్కరోజులో అమ్ముడయిపోతాయని శ్రీ వినాయక బజాజ్‌ గ్రూప్‌ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిస్కౌంట్లతో అమ్మకాలకు బూస్ట్‌ ఉంటుందని విశ్వసిస్తున్నట్టు లక్ష్మి గ్రూప్‌ డైరెక్టర్‌ కంభంపాటి జైరామ్‌ చెప్పారు. అయితే వాహనాలు మిగిలిపోతే ఎలా అన్నదే తమ ముందున్న ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కంపెనీల నుంచి ఇంత వరకు ఎటువంటి హామీ రాలేదని చెప్పారాయన.

మేం మరింత తగ్గించాం
బజాజ్‌ ఇస్తున్న డిస్కౌంట్‌కు తోడు తాము అదనంగా తగ్గింపు ఆఫర్‌ ఇస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్‌ ప్రకటించింది. సీటీ–100పైన రూ.8 వేలు, ప్లాటినా, డిస్కవర్‌–125, వీ–15 పైన రూ.10 వేలు, అవెంజర్, పల్సర్‌ మోడళ్లపై రూ.12,000, ఆర్‌ఎస్‌–200పై రూ.17,000 డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్‌లో హోండా డీలర్లు రూ.60,000 వరకు ధర గల బైక్‌లపై రూ.20,000 వరకు, స్కూటర్లపై రూ.13,500 దాకా తగ్గింపును ఇస్తున్నారు. హీరో మోటో షోరూంలు రూ.12,500 దాకా డిస్కౌంట్‌ ఆఫర్‌ చేశాయి. మహీంద్రా టూవీలర్స్‌ రూ.25,000 దాకా ధర తగ్గించింది.

హోండా:
హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తొలుత బీఎస్‌ – 3 వాహనాలపై ఫ్లాట్‌ రూ.10,000 తగ్గింపును ఆఫర్‌ చేసింది. అంతలోనే ఏమనుకుందో ఏమో రూ.22,000కు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నట్టు తెలిపింది. యాక్టివా 3జి (రూ.50,290), డ్రీమ్‌ యుగ (రూ.51,741), సీబీ షైన్‌ (రూ.55,799 – రూ.61,283), సీడీ 110డీఎక్స్‌ (రూ.47,202 – రూ.47,494). మోడళ్లపై తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

హీరో:
 హీరో మోటోకార్ప్‌ రూ.12,500 వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. స్కూటర్లపై రూ.12,500, ప్రీమియం బైక్‌లపై రూ.7,500, ప్రారంభ స్థాయి మోడళ్లపై రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్న వాటిలో డ్యూయెట్‌ (రూ.49,480), మాస్ట్రో ఎడ్జ్‌ (రూ.51,030), గ్లామర్‌ (రూ.59,755), స్లె్పండర్‌ 125 (రూ.55,575) మోడళ్లు ఉన్నాయి.

సుజుకి:
 లెట్స్, గిక్సర్‌ మోడళ్లపై సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా తగ్గింపు ధరలను ప్రకటించింది. లెట్స్‌ ధరలు రూ.47,272 నుంచి రూ.53,766 మధ్య ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు ఇవి. వీటిపై రూ.4,000 తగ్గింపుతోపాటు ఉచితంగా హెల్మెట్‌ను అందిస్తోంది. గిక్సర్‌ ధరలు రూ.77,452 – రూ.90,421 మధ్య ఉన్నాయి. వీటిపై రూ.5,000 తగ్గింపు ఇస్తోంది. ఎక్సే్ఛంజ్‌ బెనిఫిట్‌ కింద మరో రూ.2,000 తగ్గింపును సైతం పొందే అవకాశం ఉంది.

బజాజ్‌:
 డిస్కౌంట్‌తోపాటు ఉచిత వాహన బీమాను కూడా ఆఫర్‌ చేస్తోంది. ప్లాటినా, సీటీ 100 నుంచి పల్సర్‌ ఆర్‌ఎస్‌200 మోడల్‌ వరకు రూ.3,000 నుంచి రూ.12,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ‘‘విక్రయం కాని బీఎస్‌ –3 వాహనాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని ఎగుమతి చేసే అవకాశం ఉంది. మేము అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తున్నాం’’ అని  బజాజ్‌ఆటో ప్రెసిడెంట్‌  ఎస్‌.రవికుమార్‌ తెలిపారు.

పరిశీలిస్తున్నాం: ఎంఅండ్‌ఎం
సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి పలు అంశాలను పరిశీలిస్తున్నామని మహీæంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ‘‘బీఎస్‌ –3 వాహన నిల్వలను గడువులోపు సాధ్యమైన మేర విక్రయించే ప్రయత్నంలో ఉన్నాం. కోర్టు ఆదేశాలతో పడే ఈ ఏక కాల భారాన్ని పరిమితం చేసుకునేందుకు మా వైపు నుంచి ప్రతీ ప్రయత్నం చేస్తాం’’ అని కంపెనీ తెలిపింది. తగ్గింపు వివరాలను మాత్రం వెల్లడించలేదు.

మా నుంచి తగ్గింపు లేదు: అశోక్‌ లేలాండ్‌
వాణిజ్య వాహనాల అగ్రగామి కంపెనీ అశోక్‌లేలాండ్‌ మాత్రం తమ వాహనాలపై ఎటువంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది. ‘‘మా ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. ధరలపై ఎటువంటి తగ్గింపులను ఇవ్వడం లేదు’’ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన అశోక్‌లేలాండ్‌ డీలర్‌ మాత్రం సాధారణ డిస్కౌంట్‌ 4 – 5 శాతానికి అదనంగా తాము ఒకటి నుంచి రెండు శాతం వరకు తగ్గింపును బీఎస్‌–3 వాహనాలపై ఇస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు