డాలర్ ఇండెక్స్ స్పీడ్

17 Sep, 2016 01:57 IST|Sakshi
డాలర్ ఇండెక్స్ స్పీడ్

ప్రపంచ మార్కెట్లను మళ్లీ డాలరు వణికించడం మొదలుపెట్టింది. శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో డాలరు ఇండెక్స్ దాదాపు రెండు నెలల గరిష్టస్థాయికి చేరింది. దాంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు, బంగారం, క్రూడ్ క్షీణించాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 20,21 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతుందా..లేదా అనే అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజాగా అమెరికాలో ద్రవ్యోల్బణం స్థాయి 2 శాతం దాటినట్లు గణాంకాలు వెలువడటంతో ఫెడ్ రేట్లు పెంచేదిశగా కదలవచ్చన్న అంచనాలు తిరిగి నెలకొన్నాయి.

ఒక్కరోజులో అంతా తారుమారు..
క్రితం రోజు రాత్రి ఆ దేశంలో రిటైల్ అమ్మకాలు క్షీణించినట్లు డేటా రావడంతో గురువారం డోజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ సూచీలు జోరుగా పెరిగాయి. దాంతో శుక్రవారం ఉదయం భారత్‌తో సహా ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్,  సింగపూర్,  ఆసియా మార్కెట్లు ర్యాలీ జరిపాయి. కానీ అమెరికా ద్రవ్యోల్బణం డేటాతో మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకూ ఆ దేశంలో ద్రవ్యోల్బణం 2 శాతం లోపుగానే వుంటోంది.  వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరడం కూడా ఒక లక్ష్యం.

ఇది పరిపూర్తి అయినందున, ఈ సెప్టెంబర్‌లో పెంచకపోయినా, డిసెంబర్‌లో రేట్లు పెరగవచ్చన్న అంచనాలు తాజాగా ఊపందుకోవడంతో డాలరు ఇండెక్స్ ఒక్కసారిగా ర్యాలీ జరిపింది. ప్రపంచంలో పది దేశాల ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువకు అనుగుణంగా ట్రేడయ్యే ఈ ఇండెక్స్ శుక్రవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరిగి 96 స్థాయిని దాటిపోయింది. జులై తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం. వారం రోజుల క్రితం అమెరికా జాబ్స్ డేటా బలహీన ంగా వుండటంతో ఇప్పట్లో ఫెడ్ రేట్లు పెరగవన్న అంచనాలు ఏర్పడి డాలరు ఇండెక్స్ 94 స్థాయి దిగువకు పడిపోయింది.

డాలరుకు అభిముఖంగానే అన్నీ...
అమెరికా రేట్లు పెంచితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధిబాట పట్టిందనే విశ్వాసంతో కరెన్సీ విలువ పెరుగుతుందన్న అంచనాలు ఏర్పడతాయి. దాంతో ఇతర దేశాల్లోనూ, పుత్తడి తదితర ఆస్తుల్లోనూ ఇప్పటివరకూ పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నిధుల్ని వెనక్కు తెస్తారన్న ఆశాభావంతో డాలరు పెరుగుతోంది.  డాలరు విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీ విలువలు, బంగారం సహజంగానే తగ్గుతాయి. డాలరు ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన యూరో, జపాన్ యెన్‌లు తాజాగా క్షీణించాయి. భారత్ రూపాయి విలువ సైతం ఆఫ్‌షోర్ మార్కెట్లో 67.10 స్థాయికి తగ్గిపోయింది. ఇక బంగారం ఔన్సు ధర 1,310 డాలర్ల స్థాయికి తగ్గింది. బ్యారల్ క్రూడ్ విలువ 43 దిగువకు పడిపోయింది. యూరప్ సూచీలు అన్నీ క్షీణతతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా స్టాక్ మార్కెట్ 0.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా