ఉబర్‌ షార్ట్‌ లిస్ట్‌లో భారత్‌కు చోటు

31 Aug, 2018 00:05 IST|Sakshi

ఇక ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకోవాల్సిన పని లేదు. దిల్‌షుక్‌నగర్‌ నుంచి హైటెక్‌ సిటీకి కేవలం పది నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఎంచక్కా గాల్లోనే హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు. అవును ఇకపై ఉబర్‌ క్యాబ్‌లలో ఉబర్‌ పూల్, ఉబర్‌ గో మాత్రమే కాదు ఉబర్‌ ఎయిర్‌ ఆప్షన్‌ కూడా రాబోతోంది. అమెరికాలోని  దల్లాస్, లాస్‌ ఏంజెల్స్‌లో ఎగిరే కార్లను నడుపుతామని గత ఏడాది ప్రకటించిన ఉబర్‌ సంస్థ ఇప్పుడు మరో నగరంలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి అయిదు దేశాలతో షార్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో భారత్‌కు కూడా చోటు దక్కింది. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఉబర్‌ ఎలివేట్‌ ఆసియా ఫసిఫిక్‌ సదస్సులో ఉబర్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ దేశాలను ఎంపిక చేసింది. ఈ దేశాల్లోని వివిధ నగరాల్లో మార్కెట్, కొత్త తరహా రవాణా విధానాన్ని వాడడానికి ప్రజలు కనబరిచే ఉత్సాహం,  ఇతర పరిస్థితుల్ని అంచనా వేశాక ఎగిరే కార్లను నడిపే మూడో నగరాన్ని ఎంపిక చేస్తుంది. 10 లక్షల జనాభాకు మించి ఉన్న మెట్రోపాలిటన్‌ నగరంలోనే ఈ సేవలను తీసుకురావాలని భావిస్తోంది.

ఆయా నగరాల్లో స్థానిక అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలతో మమేకమయ్యే సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి మరో ఆరు నెలల్లో మూడో నగరాన్ని ప్రకటిస్తామని ఉబర్‌ వెల్లడించింది.  2020 నాటికల్లా ప్రయోగాత్మకంగా ఈ కార్లను నడిపి చూసి, 2023 నాటికి పూర్తి స్థాయిలో ఎగిరే కార్ల సర్వీసుని అందుబాటులోకి తీసుకురానుంది. ‘భారత్‌లో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ఏ సమయంలో చూసినా ట్రాఫిక్‌తో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఒకట్రెండు కిలో మీటర్ల దూరానికి గంట పట్టేస్తుంది. ఇకపై ఆ బాదరాబందీ ఉండదు. ఎగిరే కార్లను తీసుకువస్తే ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది‘ అని ఉబర్‌ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఉబర్‌ ఎలివేట్‌ ప్రత్యేకతలు
గాల్లో ఎగిరే కార్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉబర్‌ సంస్థ ఇప్పటికే ఎన్నో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ఉబర్‌ ఎలివేట్‌ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది.  బోయింగ్, బెల్‌ హెలికాప్టర్‌ వంటి డజనుకు పైగా సంస్థలు పెద్ద సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. వేలకోట్ల డాలర్ల పెట్టుబడిని పెడుతున్నాయి. ఈ ఎగిరే కార్లకు చాలా ప్రత్యేకతలున్నాయి.
ఈ కార్లు పూర్తిగా విద్యుత్‌ మీదే నడుస్తాయి
పెద్ద పెద్ద భవంతులపై కూడా సులభంగా వాలిపోగలవు
టేకాఫ్, ల్యాండింగ్‌ నిలువుగా చేస్తాయి  (వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ ఠ్టిౌ∙ఎయిర్‌క్రాఫ్ట్‌)
వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి.
15 నుంచి 100 కి.మీ. దూరం ప్రయాణించేలా కార్ల తయారీ
గంటకి గరిష్ట వేగం  300 కి.మీ
20 కి.మీ దూరాన్ని కేవలం 10 నిముషాల్లోనే చేరుకోగలవు
ఒకేసారి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం
పైలెట్‌ కాకుండా నలుగురు ప్రయాణికులు కూర్చొనేలా కార్ల డిజైన్‌
ఢిల్లీ, ముంబై,  హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ కార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సగటున రోజుకి రెండు గంటల సమయం ఆదా అవుతుందనే అంచనాలున్నాయి.
 

మరిన్ని వార్తలు