విశాఖలో ఉబెర్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌

3 Dec, 2019 05:46 IST|Sakshi

2020 చివరికి 500 మందికి ఉపాధి

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’.. విశాఖపట్నంలో తన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను సోమవారం ప్రారంభించింది. ఈ కేంద్రం ఏర్పాటు నిమిత్తం రూ. 5.73 కోట్లను వెచ్చించినట్లు ప్రకటించింది. అత్యవసర సమస్యలను పరిష్కరించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించడం కోసం శిక్షణ పొందిన బృందాలు ఇక్కడ నుంచే నిరంతర సేవలను అందిస్తాయని వివరించింది.

ప్రస్తుతం ఈ కేంద్రంలో 70 మంది పనిచేస్తుండగా.. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి వీరి సంఖ్యను 120కి పెంచనున్నామని, ఇక ఏడాది చివరినాటికి మొత్తం 500 మందికి ఉపాధి లభించనుందని ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ (కమ్యూనిటీ ఆపరేషన్స్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌) వెన్‌ స్జూ లిన్‌ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు, రైడర్లకు పూర్తిస్థాయి మద్దతును అందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రం ఇది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడంలో భాగంగా ఇక్కడ సెంటర్‌ను ప్రారంభించం’ అని వ్యాఖ్యానించారు.   

ప్రపంచంలో 12వ సెంటర్‌
భారత్‌లో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2015లో సంస్థ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం 1,000 మంది ఉద్యోగులతో ఉబెర్‌ రైడర్స్, డ్రైవర్లు, కస్టమర్లు, కొరియర్, రెస్టారెంట్‌ భాగస్వాములకు ఇక్కడ నుంచే సేవలందిస్తోంది. ఓలాకు పోటీనివ్వడం కోసం తాజాగా రెండవ సెంటర్‌ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచంలోనే కంపెనీకి ఇది 12వ సెంటర్‌గా ప్రకటించింది. అమెరికాలో 2, యూరప్‌లో 4 సీఓఈ కేంద్రాలతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లో ఇటువంటి కార్యాలయాలనే నిర్వహిస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు