ఏదైనా కొత్త పేరు కావాలి

4 Jan, 2020 03:49 IST|Sakshi

విలీనమవుతున్న బ్యాంకుల మనోగతం

యాంకర్‌ బ్యాంకు పేరిటే కొనసాగడానికి విముఖత 

కేంద్రానికి లేఖ రాసిన యూబీఐ

అదే యోచనలో సిండికేట్‌ బ్యాంకు

న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) విలీన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ఆయా బ్యాంకులు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకుకు కొత్త పేరేదైనా పెట్టాలని, కొత్తగా బ్రాండింగ్‌ చేయాలని కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ).. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు సిండికేట్‌ బ్యాంక్‌ కూడా విలీన సంస్థకు కొత్త పేరు పెట్టాలంటూ కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది. కొన్నాళ్ల క్రితమే రెండు బ్యాంకుల విలీనంతో భారీ సంస్థగా ఆవిర్భవించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) తరహా అనుభవం పునరావృతం కాకూడదని తాజాగా విలీనం కాబోయే బ్యాంకులు భావిస్తుండటమే ఇందుకు కారణం.

బీవోబీలో విజయా, దేనా బ్యాంకు విలీనం తర్వాత.. మూడింటి లోగోలను కలిపి ఒక లోగోను తయారు చేశారు. దీనికి పవర్‌ ఆఫ్‌ 3 అనే ట్యాగ్‌లైన్‌ ఉంటుంది. అయితే, ఇందులో మిగతా రెండు బ్యాంకుల కన్నా బీవోబీ లోగో ప్రముఖంగా కనిపిస్తుంటుంది. దీంతో, ఈసారి మాత్రం ఈ తరహా బ్రాండింగ్‌ వద్దని కొత్తగా విలీనం కాబోయే (నాన్‌–యాంకర్‌) బ్యాంకులు కోరుతున్నాయి. ‘విలీనంతో ఏర్పడే బ్యాంకు పేరు.. మూడు బ్యాంకుల అస్తిత్వాన్ని తెలియపర్చే విధంగా పేరు ఉండాలి. దానికి తగ్గట్టే ఏదైనా కొత్త పేరు పెట్టాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం’ అని యునైటెడ్‌ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో తమ బ్యాంకు గుర్తింపు కూడా ఉండాలని తామూ కోరుకుంటున్నామని సిండికేట్‌ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

కొత్త బ్రాండ్‌ సులువేనా.. 
ప్రస్తుతం పీఎన్‌బీలో ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంక్‌ విలీన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ప్రత్యేక కమిటీ.. కొత్తగా బ్రాండింగ్‌పైనా కసరత్తు చేస్తోంది. విలీన బ్యాంకుకు తగిన పేరును సూచించేందుకు బ్రాండింగ్‌ ఏజెన్సీల సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. అయితే, విలీన బ్యాంకుకు కొత్త పేరు పెట్టాలన్న డిమాండ్‌తో విభేదిస్తున్న బ్యాంకులూ ఉన్నాయి. అలహాబాద్‌ బ్యాంక్‌ వీటిలో ఒకటి. ఇప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న పేర్లను పూర్తిగా మార్చేయడం వల్ల బ్రాండ్‌ రీకాల్‌ విలువ దెబ్బతినవచ్చని అలహాబాద్‌ బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నాయి. ఇక, విలీన సంస్థ పేరు మార్చాలంటూ నాన్‌–యాంకర్‌ బ్యాంకులు కోరుతున్నా.. అదంత సులువైన వ్యవహారం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి పార్లమెంటు ఆమోదం కావాల్సి ఉంటుందని, గెజిట్‌ నోటిఫికేషన్‌ అవసరమని పేర్కొన్నాయి. ఇందుకు చాలా సమయం పట్టేస్తుందనేది బ్యాంకింగ్‌ వర్గాల మాట.

విలీనమయ్యే బ్యాంకులివే..
కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఇందులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంకులు.. యాంకర్‌ బ్యాంకులుగా వ్యవహరించనున్నాయి. మిగతావి నాన్‌–యాంకర్‌ బ్యాంకులుగా ఉంటాయి. పీఎన్‌బీలో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కలవడం ద్వారా దేశీయంగా రెండో అతి పెద్ద బ్యాంకు ఏర్పాటు కానుంది. అలాగే, కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం కానుంది. ఇక, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంకు కలుస్తాయి. ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్‌ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది.  

మరిన్ని వార్తలు