భారత్‌లో యూసీవెబ్‌ రూ. 120 కోట్ల పెట్టుబడులు

20 Jan, 2017 01:28 IST|Sakshi
భారత్‌లో యూసీవెబ్‌ రూ. 120 కోట్ల పెట్టుబడులు

గ్వాంగ్‌జూ: ఆలీబాబా మొబైల్‌ బిజినెస్‌ గ్రూప్‌లో భాగమైన యూసీవెబ్‌ ..భారత్, ఇండొనేషియాల్లో రూ. 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులో సుమారు 60 శాతం (దాదాపు రూ. 120 కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ జీఎం కెనీ యీ తెలిపారు.  బ్లాగ్‌లు, షార్ట్‌ వీడియోలు, సంప్రదాయేతర న్యూస్‌ ఫీడ్‌ మొదలైన వాటిని తమ యూసీ న్యూస్‌ ప్లాట్‌ఫాం ద్వారా యూజర్లకు చేర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. నియామకాలు, ఇతరత్రా వ్యాపారపరమైన వ్యయాలకు కాకుండా కేవలం కంటెంట్‌ రూపకల్పన, పంపిణీకే తాజా పెట్టుబడులు ఉపయోగించనున్నట్లు కెనీ తెలిపారు.

ఇందుకోసం వుయ్‌ మీడియా ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెస్తున్నామని, ఎవరైనా ఇందులో నమోదు చేసుకుని...తమ కంటెంట్‌ను ప్రచురించుకోవచ్చని పేర్కొన్నారు. 2017లో వుయ్‌ మీడియా ప్లాట్‌ఫాంలో 30,000 మంది పైచిలుకు సెల్ఫ్‌ పబ్లిషర్స్, బ్లాగర్లు మొదలైన వారిని నమోదు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కెనీ వివరించారు. అలాగే ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి భారత్‌లో ప్రస్తుతం 40గా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 50 శాతం మేర పెంచుకోనున్నామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు