వచ్చే ఆరు నెలలు కీలకం

2 May, 2019 00:10 IST|Sakshi

ఆర్థిక సేవల రంగంలోతీవ్ర లిక్విడిటీ సమస్య 

కోటక్‌ బ్యాంకు చీఫ్‌ ఉదయ్‌కోటక్‌ 

దేశీయ ఆర్థిక సేవల రంగంలో తీవ్రమైన లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొందన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్‌ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్‌ కోటక్‌. దేశీయ ఆర్థిక సేవల రంగం ఇప్పటికే సవాళ్లతో కూడిన కాలంలో ప్రయాణం చేస్తోందని, రానున్న రెండు త్రైమాసికాల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో నిలదొక్కుకునేందుకు బ్యాలన్స్‌ షీట్లు బలంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ‘‘ఆర్థిక సేవల రంగంలో ఎన్నో సవాళ్లతో కూడిన కాలం మధ్యలో ఉన్నాం. ఈ రంగంలోని భిన్న విభాగాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటాయనే విషయంలో వచ్చే కొన్ని నెలలు ఎంతో కీలకం’’ అని కోటక్‌ మహీంద్రా బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాల ప్రకటన సందర్భంగా మీడియాతో ఉదయ్‌ కోటక్‌ అన్నారు. యస్‌ బ్యాంకు కొత్త సీఈవో  రవనీత్‌ గిల్‌ బ్యాంకు రుణ పుస్తకంలో స్టాండర్డ్‌ ఆస్తుల్లో (ప్రామాణిక రుణాలు) రూ.10వేల కోట్లు ఎన్‌పీఏలుగా రానున్న త్రైమాసికాల్లో మారే రిస్క్‌ ఉందంటూ, రూ.2,100 కోట్ల మేర కంటింజెన్సీ ప్రొవిజన్‌ పేరుతో పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే. దీంతో యస్‌ బ్యాంకు చరిత్రలో మొదటి సారి ఓ త్రైమాసికంలో రూ.1,500 కోట్ల నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ లిక్విడిటీపై చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది.  

బ్యాలన్స్‌ షీట్లకే పరీక్ష 
‘‘ఫైనాన్షియల్‌ కంపెనీల బ్యాలన్స్‌ షీట్లు నాణ్యంగా ఉంచుకోవాల్సిన కీలకమైన సమయం. ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు అసలైన పరీక్ష బ్యాలన్స్‌ షీటే’’ అని ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. మార్కెట్లు లాభాలపై దృష్టి పెట్టడం కాకుండా ఆయా సంస్థలు క్లిష్ట సమయాల్లో నిలబడగలిగే బలమైన బ్యాలన్స్‌ షీట్లతో ఉన్నాయా అన్నదే చూడాలన్నారు. నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రయోజనం పొందింది ఆర్థిక సేవల రంగమేనని, భారీ స్థాయిలో నిధులు బ్యాంకుల్లోకి, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ప్రవేశించినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఈ నిధులు ద్రవ్యత్వం లేని ఆస్తులైన భూములు, రియల్‌ ఎస్టేట్‌వైపు వెళ్లిపోయాయన్నారు. దీన్ని అవివేకంగా ఉదయ్‌ కోటక్‌ అభివర్ణించారు. ఒక్కసారి నిధుల లభ్యత కఠినంగా మారితే ఈ తరహా ఆస్తులకు మరింత ఇబ్బంది (వెంటనే నగదుగా మార్చుకోలేని పరిస్థితులు) ఏర్పడుతుందన్నారు. ఆర్థిక రంగాన్ని కల్లోల పరిస్థితుల నుంచి సురక్షిత జలాల వైపు తీసుకెళ్లేందుకు విధాన నిర్ణేతలు, ప్రాక్టీషనర్లు దృఢంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను ఎదుర్కొంటున్న వాటికి మూలనిధులను అందించడం లేదా కన్సాలిడేషన్‌ ఉత్తమ పరిష్కారంగా సూచించారు. 

మరిన్ని వార్తలు