క్రిస్మస్‌ గిఫ్ట్‌ : కొత్త రంగుల్లో పాస్‌పోర్టు

22 Dec, 2017 17:19 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌ ప్రభుత్వం తన దేశీయులకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ అందించింది. కొత్త రంగుల్లో పాస్‌పోర్టును అందించనున్నట్టు ప్రకటించింది. 2019లో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన తర్వాత నీలం, బంగారపు రంగుల డిజైన్‌లో పాస్‌పోర్టు అందించనున్నామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బుర్గండి రంగు ట్రావెల్‌ డాక్యుమెంట్‌ను తీసివేయనున్నామని చెప్పింది. యూరోపియన్‌ యూనియన్‌ వ్యాప్తంగా వాడే ఈ ట్రావెల్‌ డాక్యుమెంట్‌ను బ్రెగ్జిట్‌ నేపథ్యంలో తొలగించనున్నట్టు తెలిసింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోవడం... తమ జాతీయ గుర్తింపును పునరుద్ధరించుకోవడానికి ఓ ప్రత్యేక అవకాశమని ఇమ్మిగ్రేషన్‌ మంత్రిత్వ శాఖ బ్రాండన్ లెవిస్‌ చెప్పారు.

ప్రపంచంలో తమకోసం ఓ కొత్త మార్గాన్ని నియమించకుంటున్నామన్నారు. ఈ కొత్త పాస్‌పోర్టులు దేశంలోనే అత్యంత భద్రతాపరమైన డాక్యుమెంట్లని అభివర్ణించారు. మోసం, ఫోర్జరీల నుంచి కాపాడేందుకు సెక్యురిటీ చర్యలను అప్‌డేట్‌ చేస్తూ ఈ పాస్‌పోర్టులను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న పిక్చర్‌ పేజ్‌ ఆధారిత పేపర్‌ను, కొత్తదానితో రీప్లేస్‌ చేయనున్నామని, మంత్రిత్వశాఖ చెప్పింది. కొత్త నీలం, బంగారం డిజైన్‌ పాస్‌పోర్టు, కొన్ని దశాబ్దాల కింద బ్రిటన్‌ వాడింది. ప్రస్తుతం 2019 అక్టోబర్‌ నుంచి వీటిని బ్రిటన్‌ ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పుడున్న పాస్‌పోర్టును 1988 నుంచి వాడుతున్నారు.  

మరిన్ని వార్తలు