డిపాజిటర్లకు మరింత ధీ(బీ)మా!

19 Oct, 2019 04:58 IST|Sakshi

డిపాజిట్లపై బీమా రూ.3 లక్షలకు పెంచే ప్రతిపాదన

ప్రస్తుతం రూ.లక్ష వరకే బీమా

బ్యాంకుల్లో మన డబ్బు మరింత భద్రం!

పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టిన డీఐసీజీసీ

త్వరలో ఆర్థిక శాఖకు నివేదిక

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత రక్షణ కలిపించే రోజులు కనుచూపుమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక బ్యాంకు పరిధిలో ఎంత మేర డిపాజిట్‌ చేసినా కానీ, ఆ బ్యాంకు సంక్షోభం బారిన పడితే గరిష్టంగా రూ.లక్ష వరకే పొందే అవకాశం ఉంది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) స్కీమ్‌ కింద బ్యాంకులు ఈమేరకు బీమాను అందిస్తున్నాయి. కానీ, గత 25 ఏళ్లుగా ఈ బీమా కవరేజీ రూ.లక్ష దగ్గరే ఉండిపోయింది. మారుతున్న పరిస్థితులతోపాటు బీమా కూడా పెరగాల్సి ఉన్నప్పటికీ అది ఆచరణ దాల్చలేదు.

ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం డిపాజిట్‌ ఇన్యూరెన్స్‌ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. 25 ఏళ్ల క్రితం గరిష్టంగా రూ.లక్ష బీమాను నిర్ణయించడం, నాటి రోజులకు అనుగుణంగానే ఉన్నది. కానీ, ఆర్జనా శక్తి పెరిగి, బ్యాంకుల్లో అధిక మొత్తంలో నిధులను ఉంచుతున్న నేటి పరిస్థితుల్లో ఈ బీమా ఏ మాత్రం చాలదు. దీన్ని పెంచాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశాన్ని డీఐసీజీసీ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై త్వరలో కేంద్ర ఆర్థిక శాఖకు ఓ నివేదిక సమ్పరించనుంది.


25 ఏళ్లుగా రూ.లక్ష వద్దే..
డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ను చివరిగా 1993లో సవరించారు. అప్పటి వరకు గరిష్ట బీమా రూ.30,000కే ఉండగా, రూ.లక్షకు పెంచారు. నాటి నుంచి సవరణ జోలికి వెళ్లలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2,098 బ్యాంకులు డీఐసీజీసీ స్కీమ్‌ పరిధిలో నమోదై ఉన్నాయి. వీటిల్లో 157 వాణిజ్య బ్యాంకులు కాగా, 1,941 కోపరేటివ్‌ బ్యాంకులు. డీఐసీజీసీ ఆర్‌బీఐ అనుబంధ సంస్థ. బ్యాంకుల్లో డిపాజిట్లకు బీమా అందించేందుకు ఏర్పాటు చేశారు. బీమా కవరేజీ కోసం బ్యాంకులు డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 2018–19లో డిపాజిట్ల ఇన్సూరెన్స్‌ ప్రీమియం కింద బ్యాంకుల నుంచి రూ.12,043 కోట్లను డీఐసీజీసీ వసూలు చేసింది.

వచ్చిన క్లెయిమ్‌లు రూ.37 కోట్లుగా ఉన్నాయి. ఇటీవలి పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభం మరోసారి దేశంలోని బ్యాంకు డిపాజిట్ల బీమాపై ప్రశ్నలకు దారితీసిందని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక ఇటీవలే పేర్కొంది. ‘‘మొత్తం అంచనా వేయతగిన డిపాజిట్లలో బీమా కవరేజీ ఉన్న డిపాజిట్లు 1981–82లో 75%గా ఉంటే, 2017–18 నాటికి అది 28%కి తగ్గిపోయింది. దీంతో బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని సమీక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని ఎస్‌బీఐ గ్రూపు ముఖ్య ఆరి్థక సలహాదారు సౌమ్యకాంతిఘోష్‌ అన్నారు.  

పరిశీలనలో కొత్త విధానం
బ్యాంకుల్లో ప్రతీ రూ.100 డిపాజిట్‌కు ప్రీమియం కింద ఫ్లాట్‌గా 10పైసలను వసూలు చేస్తుండగా, నూతన విధానానికి మళ్లడం ఆచరణ సాధ్యమా అన్న దానిపై డీఐసీజీసీ ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘సవరించిన పథకానికి ఆర్‌బీఐ, కేంద్ర ఆరి్థక శాఖ ఆమోదం తెలిపితే.. అప్పుడు పర్సనల్, ఇనిస్టిట్యూషనల్‌ అని రెండు రకాల డిపాజిట్‌ దారులు ఉంటారు. పర్సనల్‌ కేటగిరీలోకి రిటైల్, చిన్న వ్యాపారుల డిపాజిట్లు వస్తాయి. ఇనిస్టిట్యూషనల్‌ విభాగంలోకి పెద్ద కార్పొరేట్లు, ట్రస్ట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీల డిపాజిట్లు వస్తాయి. ఒకేసారి కాకుండా క్రమంగా బీమా మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆరి్థక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

రూ.5 లక్షలకు పెంచాలి!
బ్యాంకుల్లో డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ గరిష్ట పరిమితిని రూ.5లక్షలకు పెంచాలని బ్యాంకు సేవలపై సూచనల కోసం ఆర్‌బీఐ నియమించిన ఎం.దామోదరన్‌ కమిటీ 2011లోనే సిఫారసు చేసింది. కానీ, నాటి యూపీఏ సర్కారు దీన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయింది. కొంత కాలంగా ఆరి్థక శాఖ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పెంపును పరిశీలిస్తోంది. తాజాగా పీఎంసీ బ్యాంకు సంక్షోభం ఈ అవసరాన్ని మళ్లీ గుర్తు చేసింది. దీంతో డీఐసీజీసీ 50 ఏళ్ల నాటి డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని సమీక్షిస్తోంది. ‘డీఐసీజీసీ బోర్డు ఈ ప్రక్రియను ఆరంభించింది. నివేదికను ఆరి్థక శాఖకు సమరి్పస్తుంది. తదుపరి ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది’ అని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు