అమెరికాలో కొత్తగా 2.5 మిలియన్‌ ఉద్యోగాలు!

5 Jun, 2020 20:18 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో నూతనంగా 2.5 మిలియన్‌ మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలో మే నాటికి నిరుద్యోగిత రేటు 13.3 శాతానికి పడిపోయింది. దీంతో ఏప్రిల్‌లో 14.7 శాతంగా నమోదైన నిరుద్యోగిత రేటు ఒక శాతం మేర పడిపోయింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ శుక్రవారం నెలవారీ ఉద్యోగిత నివేదికను విడుదల చేసింది. కాగా కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలోనూ ఈ మేరకు ఉద్యోగాలు సృష్టించడం గమనార్హం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు దశల వారీగా సడలిస్తున్న క్రమంలో ఉద్యోగ కల్పన సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనందున క్రమక్రమంగా మాంద్యం నుంచి బయటపడవచ్చని అంచనా వేస్తున్నారు. (వెయ్యి మందికి ఉద్వాసన పలకనున్న బెంట్లీ?!)

ఇదిలా ఉండగా.. మే నాటికి 8.75 మిలియన్‌ మంది ఉద్యోగాలు కోల్పోతారన్న అంచనాల నేపథ్యంలో ఈ సంఖ్య కేవలం 2.76 మందికే పరిమితమైందని ఏడీపీ వెల్లడించడం మరో విశేషం. ఈ విషయం గురించి మూడీస్‌ అనలిటిక్స్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ మార్క్‌ జండీ మాట్లాడుతూ.. మే గణాంకాలు అంతగొప్పగా ఏమీ లేవని.. అయితే ఊహించినంత నష్టమేమీ జరుగలేదని చెప్పుకొచ్చారు. కాగా డౌ ఫ్యూచర్స్‌(ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం- స్టాక్‌ మార్కెట్‌)లో 800 మేర పాయింట్లు ఎగిసిన క్రమం నిరుద్యోగితను తగ్గించడానికి దారి తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇటలీపై కరోనా పంజా.. మెడికల్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు)

అదే విధంగా.. వాల్‌స్ట్రీట్‌లో మూడు ప్రధాన సంస్థలు లాభాల పట్టడం కూడా సానుకూల ఫలితాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఫెడరల్‌ రిజర్వు అసాధారణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రభుత్వం సైతం ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం, పేచెక్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం ద్వారా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు