బ్యాంకింగ్‌లో ఇక విలీనాల జోరు..!

10 May, 2017 05:09 IST|Sakshi
బ్యాంకింగ్‌లో ఇక విలీనాల జోరు..!

మొండిబకాయిల పరిష్కార వ్యూహమే కారణం...
బలహీన బ్యాంకులకు ప్రొవిజనింగ్‌ కష్టాలు
పెద్ద బ్యాంకుల్లో విలీనమవ్వక తప్పని పరిస్థితి
పరిశీలకుల అంచనాలు


న్యూఢిల్లీ: భారీ మొండి బకాయిల సమస్యను సత్వరం పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు .. దేశీ బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. బలహీన బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్‌ నిబంధనల కారణంగా మరింతగా నష్టాలు మూటగట్టుకునే ముప్పు ఉందని, చివరికి పెద్ద బ్యాంకుల్లో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబకాయిల్లో సింహభాగం 40–50 ఖాతాలకే పరిమితం కావడంతో ముందుగా వాటిని సత్వరం 6–9 నెలల్లో పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.

ఒకవైపు మూలధనం కొరతతో సతమతమవుతుంటే మరోవైపు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాతిపదికన బాకీలను రాబట్టుకోవాల్సి రావడం చిన్న బ్యాంకులకు తలకు మించిన భారంగా మారనుంది. ఒకవేళ బ్యాంకులు మొండిబాకీలకు ప్రతిగా కనీసం 40 శాతం మేర ప్రొవిజనింగ్‌ చేసినా బ్యాంకింగ్‌ వ్యవస్థకు రూ. 70,000 కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని అంచనా.

 సమస్యాత్మక రుణ ఖాతాల్లో 60 శాతం మేర మొత్తాన్ని రైట్‌ డౌన్‌ చేస్తే మొత్తం మూలధన అవసరాలు రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉండగలవని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పార్ట్‌నర్‌ అబిజర్‌ దీవాన్‌జీ పేర్కొన్నారు. చాలా మటుకు కేసుల్లో ఇదే జరిగే అవకాశముందని తెలిపారు. ఇదే జరిగితే చిన్న బ్యాంకులు మరింతగా నష్టపోక తప్పదని, కన్సాలిడేషన్‌ ఒక్కటే వాటికి మిగిలే మార్గమని నిపుణులు చెబుతున్నారు.

ఫాస్ట్‌ ట్రాక్‌ పరిష్కారం కష్టమే  ..
మొండి బాకీల సమస్యను వేగవంతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన చర్యలు సత్వర ఫలితాలు ఇవ్వలేకపోవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తదితర బ్రోకరేజి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.  కార్పొరేట్ల ఆదాయాలు .. లాభదాయకత అంతంత మాత్రంగానే ఉండటం,  బ్యాంకులకు ప్రభుత్వం నుంచి మరింతగా మూలధనం లభించకపోవడం వంటి పరిణామాలతో ఫాస్ట్‌ ట్రాక్‌లో ఎన్‌పీఏల పరిష్కారం కుదరకపోవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకి రుణాలిచ్చిన బ్యాంకులకన్నా రిటైల్‌ రుణాల బ్యాంకులే మెరుగ్గా ఉండొచ్చని తెలిపింది. అటు మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం బాకీల పరిష్కార చర్యలు సానుకూలమైనవే అయినప్పటికీ అమలు కావడంలో జాప్యం జరగొచ్చని అభిప్రాయపడింది. అయినప్పటికీ.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మొదలైన వాటిపై బులిష్‌గా ఉన్నట్లు తెలిపింది.
 
ఏడాదిలో తేలిపోతుంది..
ఓవైపు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాకపోగా.. మరోవైపు మార్కెట్‌ నుంచి తమంత తాముగా సమీకరించుకోలేకపోయే బ్యాంకులకు పరిస్థితి కష్టంగానే ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆయా బ్యాంకులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించలేని విధంగా పరిమితులు అమల్లోకి వస్తాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా చిన్న బ్యాంకులను.. పటిష్టంగా ఉన్న బ్యాంకుల్లో విలీనం చేసేందుకు దారితీయనున్నాయి.

 మరోవైపు ఏ బ్యాంకులను స్వతంత్రంగా కొనసాగనివ్వొచ్చు, ఏది ఎందులో విలీనం చేయొచ్చు అన్న దానిపై ప్రభుత్వానికి అవగాహన రావడానికి కూడా ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ విధానం ఉపయోగపడగలదని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ భట్టాచార్య తెలిపారు. మొత్తం మీద మొండి బాకీల సమస్య పరిష్కార వ్యూహంతో బైటపడే బ్యాంకులేవీ, నిలబడలేనివేవి అన్నది వచ్చే ఏడాది వ్యవధిలో తేలిపోనుంది. బలహీనంగా ఉన్న వాటిని పటిష్టంగా ఉన్న వాటిలో విలీనం చేయడం వల్ల అంతిమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థకు ప్రయోజనం చేకూరగలదని అశ్విన్‌ పరేఖ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ అశ్విన్‌ పరేఖ్‌ తెలిపారు.

ఈ తరహా విలీనాల విషయంలో ఎదురయ్యే పరిణామాల గురించి ... ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులను  విలీనం చేయడం ద్వారా కేంద్రం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. దీంతో భవిష్యత్‌లో పెద్దగా వ్యతిరేకత లేకుండా ఇలాంటి విలీనాలకు మార్గం సుగమం కావొచ్చన్న అభిప్రాయం నెలకొంది.

మరిన్ని వార్తలు