జైట్లీ సెస్ అస్ర్తం

1 Mar, 2016 01:25 IST|Sakshi
జైట్లీ సెస్ అస్ర్తం

ఖజానాకు మరింత ఆదాయం రాబట్టే క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఈసారి సెస్సు అస్త్రాన్ని ప్రయోగించారు. సర్వీసు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వాటన్నింటిపైనా కృషి కల్యాణ్ సెస్సును వడ్డించారు. కార్లపై మౌలిక సెస్సును వేసి వాహన కొనుగోలు భారం చేశారు. మరికొన్ని సుంకాలు, పన్నుల వడ్డింపుతో మరింత ఆదాయంపై దృష్టిపెట్టారు.

కార్ల ధరలకు  రెక్కలు..
న్యూఢిల్లీ:  బడ్జెట్‌లో వాహనాలపై ప్రవేశ పెట్టిన మౌలిక సెస్ పుణ్యమాని కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. చిన్న కార్లపై రూ.2,000 నుంచి పెద్ద డీజిల్ ఎస్‌యూవీలపై రూ. లక్ష వరకూ కార్ల ధరలు పెరగనున్నాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్లపై ఎడాపెడా పన్నులు బాదేశారు. ముఖ్యంగా డీజిల్ వాహనాలపై ఆయన ఏమాత్రం కనికరం చూపలేదు. 1,500 సీసీ ఇంజిన్ సామర్థ్యం, 4 మీ. లోపు పొడవున్న డీజిల్ వాహనాలపై 2.5 శాతం సెస్‌ను ఆర్థిక మంత్రి వడ్డించారు. ఇంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం గల కార్లు, ఎస్‌యూవీలు, సెడాన్‌లపై 4% సెస్‌ను జైట్లీ విధించారు. ఇక 1,200 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/ఎల్‌పీజీ/సీఎన్‌జీ కార్లపై 1 శాతం సెస్ ఉంటుందని జైట్లీ చెప్పారు. రూ.10 లక్షలకు మించిన లగ్జరీ వాహనాలపై 1% పన్నును వడ్డించారు. ఎక్సైజ్ సుంకాలు తగ్గించాలని కోరుతున్న వాహన కంపెనీలకు సెస్ విధింపు అశనిపాతమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఊహించని విధింపు...
సెస్ విధింపు వల్ల మారుతీ ఆల్టో, టాటా నానో వంటి చిన్న కార్లపై ధరలు రూ.2,500 వరకూ, ఇక రూ.30 లక్షలకు మించిన వాహనాలపై రూ. లక్ష వరకూ ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెస్ విధింపు ఊహించనిదని మారుతీ సుజుకీ చైర్‌పర్సన్ ఆర్.సి. భార్గవ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్ల ధరలు పెంచక తప్పదని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్య సమస్య నివారణకు గాను 2020 నుంచి యూరో సిక్స్ నిబంధనలు అమలు చేయాలని అడిగామని, దీనివల్ల కార్ల తయారీకి సంబంధించి తమ పెట్టుబడులు పెరుగుతాయని, కార్ల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. వాహన పరిశ్రమకు మౌలిక సెస్ పెద్ద దెబ్బ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కారైన ఈయాన్‌పై రూ.3,000 వరకూ, శాంటాఫే ఎస్‌యూవీపై రూ.80,000 వరకూ ధరలు పెరుగుతాయని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పడిప్పడే  కోలుకుంటున్న వాహన పరిశ్రమ సెంటిమెంట్‌పై ఈ సెస్ విధింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని టాటా మోటార్స్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

బీమాలో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: పెట్టుబడులు మరిన్ని ఆకర్షించే దిశగా బీమా, పింఛను రంగాలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీని ప్రకారం బీమా, పింఛను రంగాల్లో ఇకపై 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇప్పటిదాకా ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం ఎఫ్‌డీఐలను మాత్రమే అనుమతిస్తున్నారు. అటు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అసెట్ రీకన్‌స్రక్షన్ కంపెనీల్లో (ఏఆర్‌సీ) ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. దేశీ స్టాక్ ఎక్స్ఛేజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. దీని వల్ల దేశీ స్టాక్ ఎక్స్చేంజీలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇక బ్యాంకులు మినహా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ పద్ధతిలో ప్రస్తుత 24 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల అమలు సజావుగా సాగేలా.. దేశీయంగా కేంద్ర రాష్ట్ర పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకోవాలని జైట్లీ ప్రతిపాదించారు. ఇది కుదుర్చుకున్న రాష్ట్రాలు.. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించగలవని పేర్కొన్నారు.

 డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.56,500 కోట్లు
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల(మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. వ్యూహాత్మక విక్రయాలకు సంబంధించి నష్టదాయక కంపెనీలతోపాటు, లాభదాయక కంపెనీలనూ జాబితాలో చేర్చనుంది. కాగా వ్యూ హాత్మక పెట్టుబడుల విక్రయంలో భాగంగా ఐడీబీఐ బ్యాంక్‌లో తన వాటాను 50% దిగువకు తగ్గించుకునే విషయాన్ని పరిశీలించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.69,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకోగా రూ.25,312 కోట్లను మాత్రమే సమీకరించుకోగలిగింది. దీంతో వరుసగా ఆరేళ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని సాధించలేకపోయినట్లయ్యింది.

ఈ శాఖకు కొత్తపేరు..: పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు మార్పును బడ్జెట్ ప్రతిపాదించింది. దీనిని ఇకమీదట ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ(డీఐపీఏఎం)గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఫండింగ్‌కు కొత్త విధాన ప్రతిపాదనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్‌యూలు నిరుపయోగంగా ఉన్న తమ ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమకూర్చుకోవడం దీని ముఖ్యోద్దేశం.

10 లక్షల డివిడెండుపై పన్ను..
వ్యక్తులు, సంస్థలకు వచ్చే డివిడెండు రూ. 10 లక్షలు దాటితే 10 శాతం పన్ను విధించాలని బడ్జెట్‌లో జైట్లీ ప్రతిపాదించారు. ఇది డివిడెండు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)కి అదనంగా ఉండనుంది. ఇప్పటివరకూ డివి డెండ్లు తీసుకునే వాటాదారులు కాకుండా, వాటిని పంపిణీ చేసే కంపెనీలు డీడీటీ చెల్లిస్తుండగా, ఇకపై రూ. 10 లక్షల పైగా డివిఢ డెండు అందుకునే వారు కూడా పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాగలవు. మరోవైపు ఆప్షన్ ట్రేడింగ్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను 0.017 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రాగలదని అంచనా.

మొబైల్ ఫోన్లు కాస్త ఖరీదు..
5% దాకా పెరిగే అవకాశం
ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, పీసీలు కూడా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దూకుడు మీద ఉన్న మొబైల్ ఫోన్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాపులేటెడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (పీసీబీ) దిగుమతులపై 2 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అలాగే చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్‌సెట్లు, మొబైల్స్‌లో వాడే స్పీకర్ల దిగుమతులపై ఇప్పటి వరకు ఉన్న పలు సుంకాల మినహాయింపులను కూడా ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికే ఈ చర్యలని బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అలాగే ఐటీ, హార్డ్‌వేర్, క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తుల ధర తగ్గుతుందని, దేశీయ పరిశ్రమలో పోటీతత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పీసీబీలను ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్ల తయారీలోనూ వినియోగిస్తారు. తాజా ప్రతిపాదన ప్రభావంతో వీటి ధరలు కూడా అధికం కానున్నాయి.

 తిరోగమన చర్య..
పన్నుల పెంపు ఏమాత్రం ఉన్నా అది కస్టమర్లపై వేయకతప్పదని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ) ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ చెప్పారు. స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై పరిశ్రమ అసంతృప్తిగా ఉందని లావా ఇంటర్నేషనల్ చైర్మన్ హరి ఓమ్ రాయ్ తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొబైళ్లు, ట్యాబ్లెట్ పీసీల ధర 5 శాతం పెరుగుతుందని వెల్లడించారు. కాగా, ఇక నుంచి దిగుమతైన చార్జర్లు, అడాప్టర్లు, బ్యాటరీలు, హెడ్‌సెట్లు, మొబైల్స్‌లో వాడే స్పీకర్లపై బేసిక్ కస్టమర్స్ డ్యూటీ 10%, కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ 12.5 శాతం విధిస్తారు.

వాయిదాకు విన్నవిస్తాం..
స్పెషల్ అడిషనల్ డ్యూటీ విధింపు పరిశ్రమకు పెద్ద షాక్ అని సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా  ఆర్థిక మంత్రిని కలిసి విన్నవిస్తామని చెప్పారు. ‘పీసీబీల తయారీ భారత్‌లో లేనే లేదు. అసలు ప్రభుత్వం వీటి తయారీని ప్రోత్సహించే దిశగా తీసుకున్న చర్యలే లేవు. అలాంటప్పుడు ఉన్నఫలంగా డ్యూటీ వేయడం తగదు. కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందే’ అని వెల్లడించారు.

 బ్యాంకులకు రూ.25,000 కోట్ల తాజా మూలధనం
బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంక్ బోర్డ్ బ్యూరో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో మొండిబకాయిల సమస్య కొత్తదేమీ కాదని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  బ్యాంకుల రోజూవారీ రుణ మంజూరు విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. బకాయిల్లో రికవరీ వేగంగా జరిగేలా చూడ్డానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌ను పటిష్టపరుస్తామని కూడా స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగానికి వచ్చే ఏడాది రూ.25,000 కోట్లే కాకుండా అవసరమైతే మరింత నిధులు సైతం సమకూర్చుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

ఒక్క రోజులోనే కంపెనీ నమోదు
ఒక్క రోజులోనే కంపెనీని నమోదు చేసుకునే వీలుండేలా 2013 నాటి కంపెనీల చట్టాన్ని సవరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తేనున్నామని జైట్లీ చెప్పారు. వ్యాపారం చేయడం అత్యంత సులభంగా ఉండేలా చూడడం, స్టార్టప్‌లకు అనుకూలమైన నిబంధనలతో ఈ బిల్లును రూపొందిస్తున్నామని  2016-17 బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. కంపెనీల చట్టంపై నియమించిన ప్రభుత్వ కమిటీ ఇటీవలే సమర్పించిన తన నివేదికలో వంద సవరణలను సూచించింది. ఈ సవరణల ఆధారంగా ఈ బిల్లును తయారు చేస్తున్నామన్నారు.

పసిడి బాండ్లకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఊరట
న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా .. వీటికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గోల్డ్ బాండ్ స్కీము కింద 5,10,50, 100 గ్రాముల పసిడికి సరిసమానమైన విలువతో గోల్డ్ బాండ్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇవి 5-7  ఏళ్ల కాల వ్యవధితో లభిస్తాయి. ఆర్‌బీఐ ఇప్పటిదాకా ఈ బాండ్లను 2 సార్లు జారీ చేసింది. మరోవైపు, పసిడి డిపాజిట్ల పథకం కింద ఇచ్చే డిపాజిట్ సర్టిఫికెట్లపై వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్‌కు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని జైట్లీ చెప్పారు. పసిడి డిపాజిట్ పథకాన్ని గతేడాది నవంబర్ 5న ప్రారంభించారు. పుత్తడి దిగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో ఈ 2 పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

>
మరిన్ని వార్తలు