బాగుంది... కానీ

30 Jan, 2018 01:17 IST|Sakshi

వృద్ధిని స్వాగతిస్తూనే కార్పొరేట్ల సూచనలు

వ్యవసాయం, ఉపాధిపై ఫోకస్‌ పెరగాలి: సీఐఐ

ఎన్‌పీఏలపై పర్యవేక్షణ పెరగాలి: అసోచామ్‌

తయారీ వృద్ధితో రుణాలకు డిమాండ్‌: పీడబ్ల్యూసీ

2018–19లో వృద్ధి 7 శాతమే ఉండొచ్చు: ఇండియా రేటింగ్స్‌  

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–7.5 శాతం మేర ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను కార్పొరేట్లు స్వాగతించారు. నిలకడైన ఆర్థిక వృద్ధి సాధనకోసం మానవ వనరుల్ని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. ‘రాబోయే సంవత్సరంలో వృద్ధి వేగం మెరుగుపడటానికి, ఆ తర్వాత నుంచి మరింతగా పుంజుకోవడానికి అవసరమైన కొత్త ఐడియాలను సర్వే ప్రస్తావించింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

ప్రధానంగా మహిళల ఉపాధితో పాటు విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన మానవ వనరులను, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చడంపై మధ్య కాలికంగా మరింత దృష్టి సారించాలని సర్వేలో చేసిన సిఫార్సులు సహేతుకమైనవేనని ఆయన చెప్పారు. వీటిలో కొన్నింటినైనా బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోగలరని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఎన్‌పీఏల పరిష్కారం కీలకం: అసోచామ్‌
మొండిబాకీల సమస్య పరిష్కారమయ్యే దాకా అధిక వృద్ధి సాధ్యపడకపోవచ్చని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ జజోడియా అభిప్రాయపడ్డారు. నిరర్ధక ఆస్తులపై పర్యవేక్షణ పెంచడం, బ్యాంకులకు సాధ్యమైనంత త్వరగా అదనపు మూలధనం సమకూర్చడం చేయాలన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు పెరుగుతుండటం వంటి ఆందోళనకర అంశాలను సర్వే ప్రస్తావించింది.

ఉపాధి కల్పన, వ్యవసాయం, విద్యపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచించింది‘ అని సందీప్‌ తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడిపై మరింతగా దృష్టి సారించాలని, సంస్కరణల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పారాయన.

సేవల రంగంలో ఉద్యోగాలు పెరగాలి: డెలాయిట్‌
ఆటోమేషన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో కాయకష్టం అవసరమయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోందని డెలాయిట్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అనీస్‌ చక్రవర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో సేవల రంగంలో మరిన్ని ఉద్యోగావకాశాల కల్పన జరగాల్సి ఉంటుందన్నారు. తయారీ రంగం వృద్ధి చెందుతుండటం సానుకూలాంశమని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్‌ (ఇన్‌ఫ్రా విభాగం) మనీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్‌ పెరగడంతో పాటు సిమెంటు, ఉక్కు మొదలైన వాటి వినియోగం పెరుగుదలతో పారిశ్రామికోత్పత్తి మరింతగా మెరుగుపడగలదన్నారు.

2018–19లో వృద్ధి మెరుగుపడటం ఖాయమే అయినప్పటికీ.. ఇది సర్వేలో అంచనా వేస్తున్న శ్రేణిలో దిగువ స్థాయిలోనే ఉండొచ్చని (7 శాతం) ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌ దేవేంద్ర కుమార్‌ పంత్‌ తెలిపారు. దేశ, విదేశీ పరిస్థితుల కారణంగా వృద్ధి ఎటువైపైనా మొగ్గు చూపవచ్చన్నారు. 

మరిన్ని వార్తలు