కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

29 Jun, 2017 00:44 IST|Sakshi
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

7వ వేతన సంఘం సిఫారసులకు కేబినెట్‌ ఆమోదం
కనీస హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని నిర్ణయం
ఖజానాపై ఏడాదికి రూ. 30,748 కోట్ల భారం


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల అలవెన్సులకు సంబంధించి ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు 34 మార్పులతో కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మేలు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. కనీస హెచ్‌ఆర్‌ఏ విషయంపై కేబినెట్‌ పలు మార్పులు చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజించిన నగరాల్లో వరుసగా మూలవేతనంలో 30% (జనాభా 50లక్షలకు పైగా), 20% (5–50లక్షల జనాభా), 10% (5లక్షల కన్నా తక్కువ) ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ప్రస్తుతం చెల్లిస్తున్నారు.

అయితే, దీన్ని 24%, 16%, 8 శాతానికి తగ్గించాలని వేతన సవరణ సంఘం సూచించిందని జైట్లీ తెలిపారు. కేబినెట్‌ ఈ సవరణకు మార్పులు చేసి ఉద్యోగి నివసిస్తున్న నగరం ఆధారంగా రూ.5,400, 3,600, 1,800 కనీస హెచ్‌ఆర్‌ఏ అందేలా నిర్ణయం తీసుకుందన్నారు. రూ.18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు సూచిం చామన్నారు. అయితే.. ఉద్యోగి డీఏ మూలవేతనంలో 25–50 శాతంలోపు ఉంటే హెచ్‌ఆర్‌ఏ 27 శాతంగా, 50 శాతానికన్నా ఎక్కువ ఉంటే 30 శాతంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘డీఏ (కరవు భత్యం) 50 నుంచి 100 శాతానికి పెరిగినపుడు హెచ్‌ఆర్‌ఏ కూడా పెరగాలని వేతన సవరణ సంఘం ప్రతిపాదించింది. అయితే కేంద్రం డీఏ 25 నుంచి 50 శాతానికి పెరిగినపుడే హెచ్‌ఆర్‌ఏను సవరించాలని నిర్ణయించింది’ అని జైట్లీ తెలిపారు.

సియాచిన్, సీఆర్పీఎఫ్‌ బలగాలకు భారీ లాభం
భద్రత బలగాలకు రేషన్‌ అలవెన్సు నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. సియాచిన్‌ అలవెన్సు గురించి జైట్లీ వెల్లడిస్తూ.. ‘తొమ్మిదో లెవల్, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి  రూ.31,500 ఇవ్వాలని వేతన సంఘం సూచించింది. అయితే దీన్ని మేం రూ.42,500కు పెంచాం. ఎనిమిదో లెవల్‌ అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు రూ.30వేలు (రూ.21వేలు చేయాలని సూచన)పొందుతారు’ అని చెప్పారు. నక్సల్స్‌ ప్రాంతాల్లోని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నెలకు ఇస్తున్న అలవెన్సులు రూ.8,400 నుంచి 16,800కు, రూ. 17,300 రూ. 25,000లకు పెరుగుతాయి.  వీటి ద్వారా ఖజానాపై ఏడాదికి రూ.30,748.23 కోట్ల భారం పడనుంది.

పింఛనుదారులకు బొనాంజా
ఈ పెరిగిన అలవెన్సులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన సవరణ సంఘం సూచనలకు అదనంగా హెచ్‌ఆర్‌ఏను పెంచటం ద్వారా ప్రతిపాదనలకన్నా రూ.1,448 కోట్ల మేర అదనపు భారం పడనుంది. 53 రకాల అలవెన్సులను తొలగించాలని ఏడో వేతన సవరణ సంఘం సూచించగా.. వీటిలో 12 అలవెన్సులను కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రైల్వేలు, పోస్టల్, రక్షణ, పరిశోధన విభాగాల్లో పనిచేసే లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరగనుంది. దీంతోపాటుగా పింఛనుదారులకు మెడికల్‌ అలవెన్సులను నెలకు రూ. 500నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వందశాతం అశక్తత (డిజేబుల్‌మెంట్‌) ఉన్న పింఛనుదారుల కాన్‌స్టంట్‌ అంటెండెన్స్‌ అలవెన్సును నెలకు రూ.4,500 నుంచి రూ.6,750కి పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు

మరిన్ని వార్తలు