జీఎస్టీపై విమర్శలకు కేంద్రం భారీ సమాధానం

24 Oct, 2017 17:04 IST|Sakshi
అరుణ్‌ జైట్లీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తోన్న ఆర్థిక శాఖ.

పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు ప్రణాళికలు

‘భారత్‌ మాల’కు భారీగా నిధులు, ‘మెగా హైవే ప్లాన్‌’కు పచ్చజెండా

రూ.5. 34 లక్షల కోట్ల ప్రాజెక్టు ద్వారా 14 కోట్ల మందికి పని

తద్వారా బ్యాంకులకూ ‘మహాబూస్ట్‌’

సుదీర్ఘ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ

మొదట్లో ఇబ్బందులున్నా సంస్కరణలు ఫలిస్తాయన్న అరుణ్‌ జైట్లీ

సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయన్న విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి త్రైమాసికంలో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) దారుణంగా పడిపోయిన దరిమిలా ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇస్తూ.. ఉపాధి కల్పనకు ప్రణాళికను ప్రకటించింది. ప్రతిష్టాత్మక ‘భారత్‌ మాల’కు భారీ ఎత్తున నిధులు కేటాయించారు.  ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం కేంద్ర సచివాలయంలో ప్రత్యేకంగా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది.

భారత్‌ మాల : దేశంలో ఉపాధి కల్పనే ధ్యేయంగా రోడ్లు, రవాణా రంగాలకు సంబంధించి కేంద్రం ఇదివరకే ప్రకటించిన ‘భారత్‌ మాల’ పథకానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. దేశాన్ని చుట్టివచ్చేలా 34, 800 కిలోమీటర్ల రహదారిని ‘భారత్‌ మాల’ లో భాగంగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.10లక్షల కోట్లు కాగా, అందులో సగం రూ.5.34లక్షల కోట్లును విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. తద్వారా 14.20కోట్ల మందికి ఉపాధి లభించనుందని వివరించారు. దీనితోపాటు ప్రతిష్టాత్మక మెగా హైవే ప్లాన్‌కు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వినియోగంలోఉన్న జాతీయ రహదారుల్లో తొమ్మిదింటిని రూ.6,258 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.     

మూడేళ్లుగా దేశం దూసుకెళుతోంది : ప్రెజెంటేషన్‌కు ముందు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. తాము చేపట్టిన సంస్కరణలు తప్పక మంచి ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాల్లో వృద్ధిరేటు పడిపోయింది నిజమే. అయితే అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గడిచిన మూడేళ్లుగా ఇండియా‌.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచింది. జీఎస్టీ లాంటి భారీ సంస్కరణలు చేసినప్పుడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా, భవిష్యత్తులో తప్పక మంచి ఫలితాలు చూడొచ్చు’’ అని జైట్లీ చెప్పారు.

మేం సిద్ధంగా ఉన్నాం : గడిచిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు తగ్గిన దరిమిలా తిరిగి వృద్ధి బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని జైట్లీ తెలిపారు. ఏం చెయ్యాలనేదానిపై ఇటు ఆర్థిక శాఖలోను, అటు ప్రధాని నరేంద్ర మోదీతోనూ నిత్యం మాట్లాడుతూనే ఉన్నామన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి జైట్లీ ప్రెస్‌మీట్‌కు అధిక ప్రాధాన్యం సంతరించుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు