యూనివర్సల్ నంబరింగ్ అవశ్యం

12 Dec, 2014 00:56 IST|Sakshi
యూనివర్సల్ నంబరింగ్ అవశ్యం

హైదరాబాద్ (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ట్యాక్సీ క్యాబుల్లో, హైవేల్లో ప్రయాణించే వారు ఆపదల్లో ఉన్నప్పుడో,  అత్యవసర సమయాల్లో  పోలీస్ యంత్రాంగానికి తక్షణమే సమాచారాన్ని చేరేవేసేందుకు ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే  ఢిల్లీ తరహా సంఘటనలు పునరావృతం కాబోవని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం. టెలికాం రెగ్యులేరటరీ  అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పరిశీలనలో ఉన్న ఈ వ్యవస్థను తక్షణమే అమల్లో పెట్టాల్సిన అవసరం వుందని నిపుణులు చెపుతున్నారు.

టెలికాం వినియోగదారుల నుంచి సర్‌ఛార్జి రూపంలో ప్రభుత్వం సమీకరించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఎఫ్‌ఓ)లో రూ. 16వేల కోట్ల నిధి మగ్గుతోందని, అందులో కొంత సొమ్ము ప్రభుత్వం ఖర్చు చేస్తే టెలికాం ఆపరేటర్లపై భారం కూడా ఉండదంటున్నారు. యూనివర్సల్ సింగిల్ నంబర్ ఆధారంగా పనిచేసే ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ప్రధానంగా రెండు రకాల నంబరింగ్ సేవలను అందించగలదు. ఒకటి కాల్ చేసిన వ్యక్తి చిరునామా, వయసు లాంటి వివరాలు, రెండు కాల్ ఏ భౌగోళిక ప్రాంతం నుండి వస్తోందన్న సమాచారం పోలీసు యంత్రాంగానికి వెనువెంటనే చేరిపోతుంది. ఇటీవల ఢిల్లీలో ఒక క్యాబ్‌లో జరిగిన అత్యచార సంఘటన సందర్భంగా బాధితురాలు పలు టెక్ట్స్ మెసేజీలు పంపిన రెండు గంటల తర్వాత మాత్రమే పోలీసు యాంత్రాగానికి కాల్ చేయగలిగింది.

ఆ కాల్ ఎక్కడ్నుంచి వచ్చిందో పోలీసులు వెనువెంటనే గుర్తించలేకపోయారు. అటుతర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయడానికి చాలా సమయమే పట్టింది. ప్రతిపాదిత కాలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆపదలో వున్నవారికి తక్షణం సహాయం లభించే అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా, జీపీఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉండటంతో టెలీకామ్ ఆపరేటర్ల సాయం లేకుండానే అత్యవసర సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉంది. బీసేఫ్, ఫ్యామిలీ జీపీఎస్ ట్రాకర్, ఐ వాచ్ లాంటి యాప్స్ అత్యవసర సమాచారాన్ని బంధువులు, స్నేహితులకు చేరవేసే అవకాశం కల్పిస్తున్నాయి. ట్రూకాలర్ యాప్ ఫోన్ చేసిన వ్యక్తి వివరాలను ఖచ్చితంగా ఇవ్వగలుగుతోంది. అయితే ఆ యాప్స్ వినియోగించాలంటే స్మార్ట్‌ఫోన్ తప్పని సరి. దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 15 శాతం మించి లేరు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతేడాది ఇంటిగ్రేటెడ్ ఎమర్జన్సీ కమ్యూనికేషన్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ వినియోగంపై ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది.

అయితే ఇది తమ ఆదాయంపై ప్రభావం చూపుతుందని  టెలికాం ఆపరేటర్లు ట్రాయ్ చర్యను తీవ్రంగా అడ్డుకోవడంతో ఇది అటకెక్కింది. ప్రస్తుతం 2002లో ప్రవేశపెట్టిన కమ్యూనికేషన్స్ కన్వర్జెన్స్ బిల్లుకు కొత్త ఊపిరులు పోయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో యూనివర్సల్ ఎమర్జన్సీ నంబరింగ్ సేవలను తప్పక ప్రారంభించేలా ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేయాల్సిన సమయం ఇదే అని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ ఎమర్జన్సీ సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి బదులుగా తేలికగా గుర్తుంచుకునే ఒకటే నెంబర్‌ను ప్రవేశపెట్టడమే ఈ యూనివర్సల్ ఎమర్జన్సీ నెంబరింగ్ విధానం.

మరిన్ని వార్తలు