వాలెట్లకు చిల్లు!

16 Mar, 2017 00:53 IST|Sakshi
వాలెట్లకు చిల్లు!

ఈ–వాలెట్లకు ప్రభుత్వమే ప్రధాన పోటీదారు
యూపీఐ, ఆధార్‌పే, భారత్‌ క్యూఆర్‌తో సవాలు
పైపెచ్చు ప్రతి బ్యాంకుకూ సొంత మొబైల్‌ యాప్‌
ఇలాగైతే ఆఫర్లున్నంతకాలమే వాలెట్ల మనుగడ
గతేడాది పేటీఎంకు రూ.1,541 కోట్ల నష్టాలు
కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త సేవలు, తాయిలాలు!
ఇలాగైతే మార్కెట్లో స్థిరీకరణ తప్పదంటున్న నిపుణులు  


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎక్కువగా సంతోషపడిందీ... లాభపడిందీ వాలెట్‌ సంస్థలే. గత నవంబర్‌ 8 తర్వాత ఒక్కసారిగా డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి కూడా. అప్పటి వరకు పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్, సిట్రస్, ఇట్జ్‌క్యాష్, ఆక్సిజెన్, పేయూ మనీ వంటి వాలెట్ల సేవల్ని పెద్దగా వాడని కస్టమర్లు... తిరిగి వాటిని ఆశ్రయించడంతో ఆవి తెగ సంబరపడ్డాయి. కానీ, ఆ వెంటనే సీన్‌ మారిపోయింది. ఎందుకంటే... వాటికి ప్రభుత్వమే పెద్ద పోటీదారయింది మరి!!.

సీన్‌ మార్చిన భీమ్, ఆధార్‌ పే...
కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలను విస్తృతం చేయాలన్న సంకల్పంతో ప్రయివేటు సంస్థలకన్నా వేగంగానే పావులు కదిపింది. ఆ దిశగా పలు చర్యలు ప్రారంభించింది. ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు పెరగాలంటే మొబైలే మార్గమని భావించి... బ్యాంకు ఖాతాకు నేరుగా కనెక్టయి చెల్లించేలా తొలుత యూపీఐ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ వంటి వివరాల అవసరం లేకుండా ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే... చిన్న ఐడీ సాయంతో యాప్‌ ద్వారా ఇతరుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయొచ్చు. ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి రెండు నెలల్లోనే 1.7 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అంతేకాదు!! గత నవంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య లావాదేవీలు 18 రెట్లు పెరిగిపోయాయి.

సామాన్యులు, నిరక్ష్యరాస్యుల్ని కూడా దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అసలు మొబైల్‌ అవసరం లేకుండానే ఆధార్‌ నంబర్‌ సాయంతో డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు ‘ఆధార్‌పే’ విధానాన్ని తెస్తోంది. ఈ విధానం ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఆధార్‌ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో లింక్‌ చేస్తే ... ఎక్కడైనా సరే ఆధార్‌ నంబర్‌ చెప్పి, వేలి ముద్ర వేస్తే లావాదేవీ పూర్తయిపోతుంది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా చెల్లింపుల కోసం భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ను వీసా, మాస్టర్‌ కార్డ్‌ సంస్థల భాగస్వామ్యంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆవిష్కరించింది. వీటన్నిటికీ తోడు... ప్రతి బ్యాంకూ తన సొంత వాలెట్‌ను ఆవిష్కరించింది. తమ వ్యాపారం బయటకు పోకుండా చూసుకుంటోంది.

వాలెట్‌ సంస్థల వ్యూహాలు: చైనాకు చెందిన అలీబాబా గ్రూపు పెట్టుబడులతో... వాలెట్‌ సంస్థల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎంకు 20 కోట్ల కస్టమర్లున్నారు. ఇప్పటికే పేమెంట్‌ బ్యాంకుకు పూర్తి స్థాయి అనుమతులు పొందిన పేటీఎం త్వరలోనే ఆ సేవల్ని మొదలు పెట్టబోతోంది. డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ, యూపీఐ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావడంతోపాటు వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు సరికొత్త సేవలపై దృష్టి పెట్టింది. నిజానికి వాలెట్‌ సంస్థల ద్వారా జరిపే రీచార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు, బస్‌ టికెట్ల బుకింగ్‌ తదితర సేవలన్నీ ఉచితమే. ఆ సేవలపై వ్యాలెట్‌ సంస్థలు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయటం లేదు.

వాటిపై వచ్చే కమిషన్లపైనే ఆధారపడ్డాయి. మార్కెట్లో అగ్ర స్థానం, ఖాతాదారులను ఆకర్షించడమే లక్ష్యంగా... పెద్దగా కమిషన్‌ కూడా రాని ఫోన్‌  రీచార్జ్‌లపైనా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందించాయి. పోటాపోటీగా భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించాయి. లాభదాయకం కాని ఈ సేవల కారణంగా వాటి పెట్టుబడులు సైతం కరిగిపోయాయి. దీంతో అదనపు నిధుల కోసం అవి ప్రస్తుతం ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

నిధుల కోసం వేట...
అలీబాబా గ్రూపుతోపాటు పలువురు ఇతర ఇన్వెస్టర్ల నుంచి పేటీఎం 67.5 కోట్ల డాలర్లు (రూ.4,500 కోట్లు) సమీకరించింది. ప్రస్తుతం కంపెనీ విలువ 5 బిలియన్‌ డాలర్లుగా (రూ.33,500 కోట్లు) చెబుతున్న ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి 23 కోట్ల డాలర్ల (రూ.1,541) నష్టాలను చవిచూసింది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, సెకోయా క్యాపిటల్‌ తదితర సంస్థల పెట్టుబడులతో నడుస్తున్న మొబిక్విక్‌... ఇప్పటికే 8 కోట్ల డాలర్ల (రూ.500 కోట్లకుపైగా) నిధులను సేకరించింది. మరిన్ని నిధుల కోసం చూస్తోంది. ఈ రెండు సంస్థలూ వ్యాలెట్ల నుంచి కస్టమర్లు ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే తమ బ్యాంకు ఖాతాలకు నగదును బదిలీ చేసుకునే అవకాశం కల్పించాయి. పేటీఎం అయితే తమ సంస్థ పరిధిలోని వ్యాలెట్లు, ఖాతాల మధ్య నగదు బదిలీలు ఎప్పటికీ ఉచితమేనని ప్రకటించింది.

ఇంకా క్యాష్‌ డిస్కౌంట్లు, ఉచిత తాయిలాల ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. తొలుత మొబైల్‌ రీచార్జ్‌ సేవలతో మొదలైన ఈ సంస్థలు ప్రస్తుతం టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, డీటీహెచ్‌ బిల్లుల చెల్లింపులు, బీమా ప్రీమియంలు, సినిమా, బస్, రైలు, ఫ్లయిట్‌ టికెట్ల బుకింగ్, ఇతర ఆర్థిక సేవలను సైతం ఆఫర్‌ చేస్తున్నాయి. మొబిక్విక్‌ సంస్థ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు, రుణాలు అందించేందుకు బ్యాంకులతో టైఅప్‌ అయింది. వ్యాలెట్‌ యూజర్ల సంఖ్యను 2017 చివరికి 15 కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యాన్నీ నిర్ధేశించుకుంది.

వాలెట్‌ వ్యాపారం లాభదాయకం కాదు
ఈ వాలెట్‌ వ్యాపారం ఒక్కటే చేయటమన్నది సవాళ్లతో కూడుకున్నది. ఇది లాభదాయకం కాదు.
– విజయ్‌ శేఖర్‌శర్మ, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో.

యూపీఐ చెల్లింపుల వ్యవస్థ కాదు
యూపీఐ అన్నది బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీలకు పరిష్కారం మాత్రమే. ఇది చెల్లింపుల వ్యవస్థ కాదు. అందులో దుకాణాదారులు ఎవరూ లేరు.
– బిపిన్‌ ప్రీత్‌ సింగ్, మొబిక్విక్‌ సీఈవో

వాలెట్లకు మనుగడ లేదు
వాలెట్‌ సంస్థలకు మనుగడ లేదు. ‘రూ.500 బిల్లు కట్టి రూ.250 నగదు తిరిగి ఉచితంగా పొందు! అనే సూత్రంతో వ్యాపారం నడవదు.
– ఆదిత్యపురి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈవో

స్థిరీకరణకు అవకాశం
వాలెట్‌ సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ వ్యాలెట్ల రంగంలో వచ్చే రెండేళ్లలో స్థిరీకరణకు అవకాశం ఉంది.
– అవనీష్‌ బజాజ్, మాట్రిక్స్‌ పార్ట్‌నర్స్‌(ఇట్జ్‌క్యాష్, ఎం స్వైప్, ఓలాలో పెట్టుబడిదారుడు)

మరిన్ని వార్తలు