కార్డుల్ని మించిన యూపీఐ

17 May, 2019 02:46 IST|Sakshi

రూ.లక్ష కోట్ల విలువ దాటుతున్న లావాదేవీలు

ఏడాది కాలంలో 4.5 రెట్లు వృద్ధి  

న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ లావాదేవీల విలువ రూ.1.09 లక్షల కోట్లుగా ఉండగా, కార్డు లావాదేవీల విలువ రూ.1.05 లక్షల కోట్లకు పరిమితమైంది.

ఇక ఫిబ్రవరిలో యూపీఐ లావాదేవీల విలువ రు. 1.07 లక్షల కోట్లు కాగా.. కార్డుల విలువ రూ.93,998 కోట్లుగా నమోదైంది. మార్చిలో రెండు విధానాల్లోనూ చెల్లింపులు రూ.1 లక్ష కోట్లు దాటాయి. యూపీఐ ద్వారా రూ. 1.33 లక్షల కోట్లు, కార్డుల ద్వారా రూ.1.11 లక్షల కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగాయి. యూజర్లను ఆకర్షించేందుకు యూపీఐ యాప్స్‌.. డిస్కౌంట్లు, స్క్రా^Œ  కార్డులు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు వంటివి అందిస్తుండటం కూడా ఈ విధానం ఆదరణ పొందడానికి కారణంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

2020 నాటికి 80 శాతం ..
ఏడాది క్రితం పేమెంట్‌ గేట్‌వేస్‌ పరిమాణంలో యూపీఐ వాటా కేవలం 2 శాతమే ఉండగా.. ప్రస్తుతం 20 శాతానికి పెరిగిందని రేజర్‌పే సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హర్షిల్‌ మాథుర్‌ పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే పాత తరం డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాల మార్కెట్‌ను యూపీఐ మరింతగా ఆక్రమించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. 2020 నాటికల్లా కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో దాదాపు 80 శాతం లావాదేవీలు యూపీఐకి మారే అవకాశం ఉందని పేర్కొంది.   

డిజిటల్‌దే అగ్రభాగం: ఆర్‌బీఐ
తక్కువ స్థాయిలో నగదు వినియోగించే సొసైటీగా భారత్‌ను మార్చే ‘పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఇండియా: విజన్‌ 2019– 2021ను ఆర్‌బీఐ ఆవిష్కరించింది. దీని ప్రకారం 2018 డిసెంబర్‌ నాటికి డిజిటల్‌ లావాదేవీలు 2,069 కోట్లు కాగా, 2021 నాటికి నాలుగురెట్లు పెరిగి 8,707 కోట్లకు చేరుతాయి. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీల విషయంలో ఆర్‌బీఐ జోక్యం పరిమితంగానే ఉంటుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా