ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి

28 Apr, 2020 12:36 IST|Sakshi
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ( ఫైల్ ఫోటో)

సాక్షి, ముంబై : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు సానుకూల ఫలితాలనిచ్చినప్పటికీ ఆర్థిక  కార్యకలాపాలు పూర్తి నిలిచిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అభిప్రాయపడ్డారు. ఇపుడు ఆర్ధిక పతనంనుంచి కాపాడేందుకు త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

వైరస్ కట్టడితోపాటు ప్రస్తుతం ఆర్థిక శ్రేయస్సుపై కూడా దృష్టి పెట్టడం అత్యవసరమని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ఎకానమీ నిద్రావస్థలోకి జారిపోకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూడాలన్నారు.  దేశంలో ఆర్థికమాంద్యం కూడా ప్రమాదమేనని జిందాల్ పేర్కొన్నారు. అలాగే అతి తక్కువ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని సామర్థ్యానికి  సాధించేందుకు కొత్త  పని మార్గాలను కనుగొనాలని ఆయన అన్నారు.  (నోకియా దూకుడు : భారీ డీల్)

కాగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మార్చి 25 నుండి 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. అనంతరం దీనిని మే 3వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రతి రంగంలోని వ్యాపారాలను ప్రభావితం చేసింది. అయితే ఏప్రిల్ 20నుండి అనేక పరిశ్రమలకు,సంస్థలకు సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.  అవసరమైన వస్తువులు, సేవలను మినహాయించి 40 రోజుల లాక్‌డౌన్  దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు