ట్రంప్‌ మరో ఎటాక్‌ : చైనా సీరియస్‌

4 Apr, 2018 09:49 IST|Sakshi

ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు రోజురోజుకి తీవ్రతరమవుతున్నాయి. మరోసారి ట్రంప్‌, చైనాపై ఎటాక్‌ చేశారు. 50 బిలియన్‌ డాలర్ల(రూ.3,24,825 కోట్ల) విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లను విధించింది. వీటిలో హై-టెక్నాలజీ ఉత్పత్తుల నుంచి సెమీ కండక్టర్లు, లిథియం బ్యాటరీల వరకు ఉన్నాయి. మొత్తం 1300 రకాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించింది. అమెరికా ఈ చర్యపై చైనా మండిపడింది. అమెరికా ఉత్పత్తులపై కూడా తాము ఇదే రకంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇటీవలే అమెరికా విధించిన స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా, చైనా అమెరికా గూడ్స్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. చైనాకి కౌంటర్‌గా ట్రంప్‌ మరోసారి మరికొన్ని ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు విధించారు. 

చైనా హానికరమైన చర్యలను, విధాలను తొలగిస్తున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఆఫీసు పేర్కొంది.  తమ మేథోసంపత్తి హక్కువ విధానాలను మారుస్తున్న 1300 ఉత్పత్తులను టార్గెట్‌ చేసి, ఈ టారిఫ్‌లను విధించామని ఆఫీసు తెలిపింది. అమెరికా ఆర్థికవ్యవస్థపై, వినియోగదారులపై ప్రభావం తగ్గించే పాలసీ ఆధారంగా అమెరికా ఈ ఉత్పత్తులను ఎంచుకుందని చెప్పింది.  ఈ  ప్రొడక్ట్‌లలో స్టీల్‌, టెలివిజన్‌ కాంపోనెంట్లు, మెడికల్‌ డివైజ్‌లు, డిష్‌వాషర్లు, స్నో బ్లోవర్స్‌ ఉన్నాయి. హెల్త్‌ కేర్‌ నుంచి ఏవియేషన్‌, ఆటో పార్ట్‌ల వరకు అన్ని రంగాల ఉత్పత్తులపై ఈ టారిఫ్‌లు పడ్డాయి. అయితే తాజాగా అమెరికా విధించిన టారిఫ్‌లపై, చైనా ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటోదనని ఆసియన్‌​ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రస్తుతం విధించిన టారిఫ్‌లను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇంతే భారీ మొత్తంలో అమెరికా ఉత్పత్తులకు వ్యతిరేకంగా తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  అంతేకాక ఈ విషయాన్ని డబ్ల్యూటీఓ వద్దకు తీసుకెళ్లనున్నట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు