ఎగుమతులపై అమెరికా పేచీ..

16 Mar, 2018 00:18 IST|Sakshi

భారత సబ్సిడీ పథకాలపై డబ్ల్యూటీవోకి ఫిర్యాదు

తమ సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపణ

వాషింగ్టన్‌: ఇటీవలే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించిన అమెరికా తాజాగా.. భారత్‌లో ఎగుమతి సంస్థలు పొందుతున్న రాయితీలపై దృష్టి సారించింది. భారత్‌ అమలు చేస్తున్న ఎగుమతి సబ్సిడీ పథకాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాలు చేసింది. ఇవి తమ కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.

ఎగుమతి సంస్థలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా భారత్‌ కనీసం అరడజను పథకాలు అమలు చేస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్‌) రాబర్ట్‌ లైథిజర్‌ పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అమెరికాలో తక్కువ రేట్లకు ఉత్పత్తులను అమ్ముతున్నాయని, ఫలితంగా సమాన స్థాయి అవకాశాలు లేక అమెరికా కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన తెలిపారు. వాణిజ్య ఒప్పందాల్లో తమ హక్కులను కాపాడుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే .. అమెరికా పర్యటనలో ఉండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు ముందుగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించనున్నాయి. అది కుదరని పక్షంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార కమిటీని అమెరికా ఆశ్రయించనుంది. భారత్‌ ఇప్పటికే పౌల్ట్రీ, సోలార్‌ రంగానికి సంబంధించిన కేసులను ఓడిపోయింది. 2016–17లో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 42.21 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌కు దిగమతులు 22.30 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

ఏటా 7 బిలియన్‌ డాలర్ల లబ్ధి..
ఎగుమతి ఆధారిత సంస్థల పథకం, ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ స్కీము, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ మొదలైనవి ఈ తరహా పథకాల్లో ఉన్నాయని రాబర్ట్‌ పేర్కొన్నారు.     వీటి ద్వారా కొన్ని సుంకాలు, పన్నులు, ఫీజులు మొదలైన వాటి నుంచి ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్స్, కెమికల్స్‌ తదితర రంగాల సంస్థలకు భారత్‌ మినహాయింపులు ఇస్తోందని ఆయన తెలిపారు.

తద్వారా వేల కొద్దీ భారతీయ కంపెనీలు.. వార్షికంగా 7 బిలియన్‌ డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 2015లోనే భారత్‌ ఈ ఎగుమతి సబ్సిడీ పథకాలను ఉపసంహరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగిస్తోందని రాబర్ట్‌ ఆరోపించారు. వరుసగా మూడేళ్లుగా భారత్‌ 1,000 డాలర్ల స్థూల తలసరి జాతీయ ఆదాయ (జీఎన్‌ఐ) స్థాయి దాటిన నేపథ్యంలో ఎగుమతి సబ్సిడీలను ఇవ్వడానికి అర్హత ఉండదంటూ సంపన్న దేశాలు వాదిస్తున్నాయి.   

అమెరికాతో చర్చిస్తాం: భారత్‌
ఎగుమతి సబ్సిడీ పథకాల వివాదంపై అమెరికాతో చర్చలు జరుపుతామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. అమెరికా ముందుగా చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరిందని, దానికి అనుగుణంగా ఈ విషయంలో భారత విధానం గురించి వివరిస్తామన్నారు. అమెరికా కూడా సానుకూలంగా స్పందించగలదని ఆశిస్తున్నట్లు రీటా పేర్కొన్నారు.  

ఆందోళనలో దేశీ సంస్థలు..
సబ్సిడీ పథకాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత ఎగుమతి సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఎకాయెకిన వీటిని ఎత్తివేస్తే దేశీ వ్యాపార సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు.

‘భారత ఎగుమతి సంస్థలకు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. సదరు ఎగుమతి సబ్సిడీలను క్రమంగా ఉపసంహరించాలే తప్ప ఒకేసారి తొలగించడం తగదు‘ అని ఆయన తెలిపారు. దేశీ ఎగుమతిదారులకు అమెరికా చాలా పెద్ద మార్కెట్‌ అని, భారత్‌ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 14 శాతం ఉంటుందని సహాయ్‌ వివరించారు.   
 

ఎగుమతులు 4.5 శాతం అప్‌
ఫిబ్రవరిలో 25.8 బిలియన్‌ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు వృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో 4.5 శాతం పెరిగి 25.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా 10.4 శాతం పెరిగి 37.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 12 బిలియన్‌ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా ఈ విషయాలు వెల్లడించారు. ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి సానుకూలంగా ఉంటోందని ఆమె వివరించారు.

ప్రధానంగా రసాయనాలు, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉంటున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్‌ ఎగుమతులు 11 శాతం వృద్ధి చెంది 273.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు 21 శాతం వృద్ధి చెంది 416.87 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 32 శాతం పెరిగాయి.   

మరిన్ని వార్తలు