అమెరికా ఫెడ్‌ వడ్డీరేటు యథాతథం

22 Sep, 2017 18:37 IST|Sakshi
అమెరికా ఫెడ్‌ వడ్డీరేటు యథాతథం

న్యూయార్క్‌: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌... ఫెడరల్‌ రిజర్వ్‌.. ఫండ్‌ రేటు యథాతథంగా కొనసాగనుంది. ప్రస్తుతం ఈ రేటు 1–1.25 శాతం శ్రేణిలో ఉంది. మంగళ, బుధవారాల్లో కీలక విధాన సమావేశం నిర్వహించిన ఫెడ్‌ తాజా నిర్ణయం తీసుకుంది. అమెరికాలో వెలువడుతున్న ఆర్థిక గణాంకాల హెచ్చుతగ్గులు...కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.  

కఠిన విధానమే...
భారత్‌ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి వెలువడిన ఫెడ్‌ ప్రకటన ప్రకారం... అక్టోబర్‌ నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ తగ్గింపు ప్రక్రియను మొదలు పెడుతుంది. వ్యవస్థ నుంచి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) ఉపసంహరణ దీని ఉద్దేశం. ఈ ఏడాది డిసెంబర్‌లో మరో విడత రేటు పెంపు ఉంటుందని, వచ్చే ఏడాది ఈ పెంపు మూడు దఫాలుగా జరగవచ్చన్న సంకేతాల్ని ఫెడ్‌ కమిటీలో అధికశాతం సభ్యులు వెలిబుచ్చారు. ఆయా అంశాల నేపథ్యంలో అమెరికాలో ద్రవ్యోల్బణం సమీపకాలంలో 2శాతం లోపే ఉండవచ్చని ఫెడ్‌ అంచనావేసింది.

2017లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ రేటు అంచనా 2.2 శాతం.  వచ్చే ఏడాది 2.1 శాతంగా అంచనావేసింది. అమెరికా ఆర్థిక వృద్ధి లక్ష్యంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో 0–0.25 శాతం శ్రేణికి తగ్గినడ్డీరేటును ఏడాది నుంచీ ఫెడ్‌ క్రమంగా పెంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు