కోవిడ్‌పై ఫెడ్‌ అస్త్రం!

4 Mar, 2020 03:56 IST|Sakshi

అత్యవసరంగా వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా కేంద్ర బ్యాంకు

50 బేసిస్‌ పాయింట్ల కోత

కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిలువరించేందుకే  

వాషింగ్టన్‌: యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసరంగా కీలక రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు (అర శాతం) తగ్గిస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత విస్తరిస్తుండడంతో, దీన్నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు రేట్లను 1–1.25 శాతం స్థాయికి తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత ఫెడ్‌ అత్యవసరంగా రేట్ల కోతకు దిగడం మళ్లీ ఇదే మొదటిసారి. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉంది. అయితే, కరోనా వైరస్‌తో ఆర్థిక కార్యకలాపాలకు సమస్యలు పొంచి ఉన్నాయి. ఈ రిస్క్‌ల నేపథ్యంలో, గరిష్ట ఉపాధి కల్పనను సాధించేందుకు, ధరల స్థిరత్వ లక్ష్యం కోసం ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ ‘ఫెడరల్‌ ఫండ్స్‌’ రేటు లక్ష్యంతో శ్రేణిని తగ్గించాలని నిర్ణయించింది’’ అని ఫెడ్‌ ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి మార్చి 17–18 తేదీల్లో ఫెడ్‌ పాలసీ సమావేశం జరగనుంది. దీనికి మరో 15 రోజుల వ్యవధి ఉంది. కానీ, కరోనా వైరస్‌  అంతర్జాతీయ మాంద్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. ఫెడ్‌ ఈలోపే అత్యవసర రేట్ల కోతకు దిగాల్సి వచ్చింది. గతేడాది రేట్ల కోత తర్వాత తొలి రేట్ల కోత ఇది. గతేడాది మూడు విడతలుగా ఫెడ్‌ రేట్లను తగ్గించి 1.5–1.75 స్థాయికి తీసుకొచ్చింది. 2020లో రేట్లలో ఎటువంటి మార్పులు ఉండవని గతంలో ప్రకటించిన ఫెడ్‌.. కరోనా కారణంగా విధానాన్ని మార్చుకుంది. కాగా, ఆరంభంలో భారీ నష్టాల్లో నడిచిన డౌజోన్స్‌ ఫెడ్‌ రేట్ల కోత ప్రకటన తర్వాత తీవ్ర ఆటుపోట్ల మధ్య ట్రేడయింది. కరోనా భయాలతో గత వారం డౌజోన్స్‌ 14% పడిపోవడం గమనార్హం.

మాంద్యం భయాలవల్లే... 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2008 నాటి మాంద్యం నుంచి బయటపడింది కానీ, చెప్పుకోతగ్గ స్థాయిలో రికవరీ కాలేదు. దాదాపు అన్ని సెంట్రల్‌ బ్యాంకులు మళ్లీ మాంద్యంలోకి జారిపోకుండా.. సర్దుబాటు ధోరణులతో రేట్ల తగ్గింపుతోపాటు అన్ని రకాల సాధనాలను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారొచ్చన్న ఆందోళన విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫెడ్‌ అత్యవసరంగా రేట్ల కోతను చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం జీ–7 దేశాల(యూఎస్, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా) ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల చీఫ్‌లు అత్యవసరంగా సమావేశం కావడం కూడా ఇందుకే.

కరోనా వైరస్‌ను నిలువరించి, ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా ద్రవ్యపరమైన చర్యలు సహా అవసరమైతే అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీ–7 దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జీ–7 నుంచి ఈ తరహా సంయుక్త ప్రకటనలు 2001 సెప్టెంబర్‌ 11 దాడుల ఘటన, 2008 మాంద్యం సమయాల్లోనూ వెలువడడం గమనార్హం. కరోనా వైరస్‌  60కుపైగా దేశాలకు వేగంగా విస్తరించిందని, ఇది ప్రస్తుత త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిని దిగజార్చవచ్చని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) కూడా ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2020లో 2.4% కి తగ్గొచ్చని, వైరస్‌ మరింతగా విస్తరిస్తే 1.5%కి పడిపోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2% దిగువకు ప్రపంచ వృద్ధి పడిపోతే దాన్ని మాంద్యంగా పరిగణిస్తారు.

ఆర్థిక వ్యవస్థపై వైరస్‌ ప్రభావం: పావెల్‌ 
అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం కొంత కాలం పాటు ఉంటుందన్నారు ఫెడ్‌ చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌. సెంట్రల్‌ బ్యాంకు చర్య ఆర్థిక వ్యవస్థకు తగినంత చేయూతనిస్తుందని తాను నమ్ముతున్నట్టు ఫెడ్‌ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వృద్ధి అంచనాలకు ఉన్న రిస్క్‌ను చూసే ఈ చర్య తీసుకున్నాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. బలమైన వృద్ధి, బలమైన లేబర్‌ మార్కెట్‌లోకి తిరిగి మళ్లీ మనం ప్రవేశిస్తామని నేను సంపూర్ణంగా భావిస్తున్నాను’’ అని పావెల్‌ పేర్కొన్నారు.

ఇది సరిపోదు 
‘‘ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను తగ్గిస్తోంది కానీ మరింత తగ్గించాలి. మరీ ముఖ్యంగా ఇతర దేశాలు, పోటీదేశాల స్థాయికి రేట్లు దిగి రావాలి. మనం సహేతుక స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. మరింత రేట్ల కోత దిశగా ఫెడరల్‌ రిజర్వ్‌ అడుగులు వేయాల్సిన సమయం ఇది’’  – డోనాల్డ్‌ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

చదవండి :  వొడాఫోన్‌ ఐడియా బంపర్‌ ఆఫర్‌

రివోల్ట్‌ ఇ-బైక్స్‌ లాంచ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు